‘మహావతార్ నరసింహ’ రివ్యూ..!

కన్నడ సినీ పరిశ్రమలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన హోంబాలే ఫిల్మ్ సంస్థ నుంచి మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ కొద్ది రోజుల క్రితం ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది.. కాంతారా, ‘కేజీయఫ్‌’, ‘సలార్‌’ వంటి భారీ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ఈచిత్రాన్ని నిర్మించింది. సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ ఎలా ఉంది.. కథాంశం ఏమిటీ.. అంచనాలను అందుకుందా.. లేదా అనేది చూద్దాం…

విష్ణు – హిరణ్యకశిపుల యుద్ధం, ప్రహ్లాదుడి కథ
ఈ ‘మహావతార్ నరసింహ’ చిత్రంలో ప్రహ్లాదుడి చరిత్ర, భగవాన్ విష్ణువుకు , అసుర చక్రవర్తి హిరణ్యకశిపునికి మధ్య జరిగిన పౌరాణిక యుద్ధాన్ని అత్యంత ఆసక్తికరంగా చూపించారు. నరసింహ అవతార వెనుక ఉన్న అసలు కథను, దాని ప్రాముఖ్యతను ఈ యానిమేటెడ్ చిత్రం ద్వారా నేటి తరానికి పరిచయం చేశారని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తనను తాను దేవుడిగా ప్రకటించుకుని, తన కుమారుడితో సహా తన ప్రజల నుండి భక్తిని కోరే కథను ఈ చిత్రం అనుసరిస్తుంది. అయినప్పటికీ, అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుకు అంకితమై, దైవ జోక్యానికి వేదికను ఏర్పాటు చేస్తాడు. ఇది చాలా మందికి సుపరిచితమైన కథ, కానీ ఈ చిత్రం చేయగలిగింది ఏమిటంటే, దీనికి కొత్త భావోద్వేగం, లోతు మరియు వ్యక్తిగత ప్రతిబింబాన్ని కూడా ఇస్తుంది. ట్రైలర్ లో ఏం జరగబోతుందో ఒక గ్లింప్ మాత్రమే ఇచ్చినా.. ఇప్పుడు సినిమా అంచాలను మించిపోయింది. భారతీయ యానిమేషన్ సినిమాల్లోకి ఆశ్చర్యకరమైన , శక్తివంతమైన ప్రవేశాన్ని సూచిస్తుందని సినీ వర్గాలు అభిప్రాపడుతున్నారు. విజువల్స్, గ్రాఫిక్స్ అత్యద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

సినిమాకు బలం..
ఈ యానిమేషన్ మూవీ కొత్త భావోద్వేగం, లోతు , వ్యక్తిగత ప్రతిబింబాన్ని కూడిన విధంగా చూపిస్తుంది. యానియేషన్ ఓ మోస్తరు నిర్మాణ విలువతో ప్రారంభం అవుతుంది. అయితే సినిమా ముందుకు సాగే కొద్దీ యానిమేషన్ క్యాలిటీ బాగా పెరగడంతో కథతో పాటు సినిమాను హైప్ కు తీసుకెళ్తుంది. సెకాండాఫ్ లోకి వచ్చే సమయానికి యానిమేషన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. దీనిలో కొన్ని సన్ని వేశాలు గూస్ బప్స్ ఇచ్చేంత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారని అభిమానులు చెప్పుకొస్తున్నారు..

విశ్లేషణ :
నిజానికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడి గురించి మన వేదాలలో ప్రస్తావన ఉంది. వారిద్దరూ జయ విజయులు, మహావిష్ణు ఆంతరంగిక సమయంలో సనకసనందాది మహామునులను లోపలికి వెళ్ళకుండా అడ్డగిస్తారు. దీంతో వారికి కోపం వచ్చి, వారికి శాపం విధిస్తారు. ఆ శాపం ప్రకారం వారు మూడు జన్మలు విష్ణు ద్వేషులుగా జన్మించి, తిరిగి విష్ణు నివాసానికి వెళ్ళేలా శాపాన్ని మార్చుకోగలుగుతారు. అక్కడిదాకా మన వేదాలలో ఉంది. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా నేరుగా కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మించినప్పటి నుంచి ఈ సినిమా కథ మొదలవుతుంది. మొదలైనప్పటి నుంచి ఎక్కడా డివియేషన్స్ లేకుండా వారిద్దరి క్రూరత్వాన్ని చూపించారు. ఆ తర్వాత భూమాతను హిరణ్యాక్షుడు సముద్ర గర్భంలో దాచడం, ఆమెను కాపాడేందుకు వరాహ అవతారంలో మహా విష్ణువు రావడం వంటివి సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. ముఖ్యంగా వరాహ అవతారాన్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు రెండు కళ్ళూ చాలవు, అంటే అతిశయోక్తి కాదు. ఒకరకంగా అది గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పాలి. ఇక ఆ తర్వాత హిరణ్యాక్షుడి మరణం, హిరణ్యకశిపుడి బ్రహ్మ కోసం తపస్సు చేయడం వంటి అంశాలను ఆసక్తికరంగా మలిచారు. ఇక ఆ తర్వాత భక్త ప్రహ్లాదుడి కథను మొదలుపెట్టి అత్యద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా భక్త ప్రహ్లాదుడి రూపం అయితే అద్భుతంగా క్రియేట్ చేశారు. ఆ తర్వాత ప్రహ్లాదుడి గురుకుల వాసం వంటి విషయాలను కళ్ళకు కట్టినట్లు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఎప్పుడైతే సినిమాలో హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుడిని చంపమని ఆదేశిస్తాడు, అప్పటి నుంచి సినిమా మరింత ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది. ఇక ఫైనల్‌గా హిరణ్యకశిపుడిని అంతమొందించేందుకు శ్రీ విష్ణు లక్ష్మీ నరసింహ అవతారంగా ప్రేక్షకుల ముందుకు రావడం అయితే అత్యద్భుతంగా చూపించారు. నిజానికి ఇది యానిమేటెడ్ సినిమా అయినా సరే, ప్రేక్షకులు నరసింహుడు చేస్తున్న ఫైట్, ఆయన రూపాన్ని చూసి ఈలలు వేస్తూ గోల చేశారంటే, దర్శకుడు ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయినట్లే చెప్పాలి. నిజానికి ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుని సినిమాలు చేస్తున్నా సరే, ప్రేక్షకులను ఒక పట్టాన ఆకట్టుకోలేకపోతున్నాయి. కానీ యానిమేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఆద్యంతం సాగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ సినిమాకి టెక్నికల్ టీమ్‌లో ప్రధానమైన హీరో ఎవరంటే సామ్ సీఎస్. మామూలుగానే ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కొడతాడనే పేరు ఉంది. ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దుమ్ము దులిపేశాడు. అంతేకాక, యానిమేషన్ క్రియేటర్స్ కూడా మంచి ఔట్‌పుట్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ సినిమాని నిర్మించినట్లు క్వాలిటీ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. కాకపోతే సంభాషణలను మరింత సరళంగా రాసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలు వాటికి బాగా కనెక్ట్ అయ్యేవారు. అయితే మెయిన్ చూసిన థియేటర్లలో ఉన్న పిల్లలు కూడా ఆ సంభాషణలకు, స్క్రీన్ ప్రెజెంట్‌కి, విజువల్స్‌కి అబ్బురపడుతూ చప్పట్లు కొడుతూ ఉండడం గమనార్హం. ఇలాంటి కథను చెప్పాలనుకున్న దర్శకుడు అశోక్, ప్రోత్సహించిన నిర్మాతలను అభినందించాలి …