పాతబస్తీలో ఆదివారం (జులై 20) జరిగిన బోనాల వేడుకల్లో బీజేపీ కీలక నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. బండి సంజయ్ కోసం ప్రీతి దాదాపు 5 గంటల పాటు వెయిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో మరుసటి రోజైన సోమవారం హైదరాబాద్ లోని మేకలమండి బీజేపీ నేత ఇంట్లో నిర్వహించిన లంచ్ కు బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ హాజరయ్యారు.
ఇదే కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా వచ్చారు. వీరిద్దరూ ఒకే టేబుల్ మీద భోజనానికి కూర్చున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తమతో పాటు కూర్చున్న వ్యక్తులను ప్రీతి రెడ్డికి పరిచయం చేయగా.. ఆమె మర్యాదపూర్వకంగా వారికి నమస్కారం చేశారు. ఆతర్వాత ప్రీతిరెడ్డి, బండి సంజయ్లు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సన్నివేశాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.
రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన కొడుకు, కోడలితో కలిసి ప్రధాని నరేంద్రమోడీని కలవడం, ఆ తర్వాత మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి నేరుగా బీజేపీ ఆఫీసుకు వెళ్లడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నదనే చర్చ జరుగుతున్నది. కమలం పార్టీ కీలక నేతల సహకారంతో మల్లారెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారని, అగ్రనాయకత్వం సైతం ఆయన చేరికపై సానుకూలంగా ఉందని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఫ్యామిలీ కమలదళంలో ఒకరిగా ఉంటారని పేర్కొంటున్నారు. ఈ ప్రచారాన్ని మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ఖండిస్తున్నారు…
ఊహాగానాలకు బలం..
ఏఐకు సంబంధించి విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మల్లారెడ్డి..
తన కొడుకు, కోడలితో ఇటీవల ప్రధాని మోడీని కలిశారు. దీనిపై ప్రధాని సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఆ తర్వాత ప్రీతిరెడ్డి ఒక అడుగు ముందుకేసి నేరుగా బీజేపీ స్టేట్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) చంద్ర శేఖర్ తివారీని కలిసి ఆయనను సైతం కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం, ఆ తర్వాత కోడలు బీజేపీ ఆఫీసుకు వెళ్లడం వెనక చాలా మతలబు ఉందని కమలం పార్టీ నేతలే చెబుతున్నారు. ఏదైనా కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని ఆహ్వానిస్తారని, కానీ మల్లారెడ్డి కోడలు ఏకంగా ఒక పార్టీ కీలక నాయకుడిని ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లి ఆహ్వానించారంటే.. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని, అదే సమయంలో బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది.
ఐదు టికెట్లు.. భారీ ఆఫర్!.
మల్లారెడ్డి తన ఫ్యామిలీతో కలిసి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని కమలనాథులు చర్చించుకుంటున్నారు. కోడలు ప్రీతిరెడ్డికి మల్కాజిగిరి ఎంపీ సీట్, తనకు, అల్లుడు, కొడుకుకు అసెంబ్లీ సీట్లు.. మొత్తంగా ఐదు టికెట్లు ఇవ్వాలని మల్లారెడ్డి ప్రతిపాదన పెట్టినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అలా ఇస్తే మల్కాజిగిరి ఎంపీతో పాటుగా ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఖర్చు తానే భరిస్తానని మల్లారెడ్డి కమలం నేతలకు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కమలనాథుల నుంచి ఆయనకు కొంత సానుకూల స్పందన వచ్చినట్టు చర్చ జరుగుతున్నది. దీనిలో భాగంగానే ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి ధైర్యంగా వెళ్లారని, ఆ తర్వాత సమర్థించుకున్నారని చెబుతున్నారు. విద్యాసంస్థలు, వ్యాపారాలు ఉన్న వారు, ఒక రాజకీయ పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు మరొక పార్టీ కార్యాలయానికి వెళ్లడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనే చర్చ జరుగుతున్నది…
మెడికల్ కాలేజీల విస్తరణ కోసమేనా!.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలను స్థాపించిన మల్లారెడ్డి.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా ఒకే సారి 18 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయించారు. వీటి కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విశాఖపట్నం, నూజివిడుతోపాటు ఉత్తర భారతదేశంలోని లక్నో, మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్, పశ్చిమబెంగాల్లోని కోల్కతా, నోయిడా, ఢిల్లీ సహా మొత్తం 18 ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణలో పెద్ద విద్యాసామ్రాజ్యాన్ని మల్లారెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. మెడికల్ కాలేజీలు, ఇంజినీరింగ్, డిమ్డ్ యూనివర్సిటీ, కేజీ నుంచి పీజీ వరకు అన్ని రకాల విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన విద్యా సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. అయితే దీనికి బీజేపీ మద్దతు అవసరమని భావించి ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు చర్చ జరుగుతున్నది.