బతుకమ్మ కుంట విషయంలో సుప్రీంకోర్టులో హైడ్రాకు ఎదురుదెబ్బ..

బతుకమ్మ కుంట విషయంలో సుప్రీంకోర్టులో హైడ్రాకు ఎదురుదెబ్బ..

బతుకమ్మ కుంట విషయం హైకోర్టులో పెండింగ్ ఉండగా ఎలా అభివృద్ధి చేస్తారని, బతుకమ్మ కుంటలోని బోర్డులు తీయాలని ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు..

తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హైడ్రా

హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు..

అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంట భూవివాదం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ కుంటపై తమ ఆధిపత్యాన్ని సూచించే బోర్డులు, శిలాఫలకాలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో హైడ్రా (HYDRAA) అధికారులు చర్యలు చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు కుంట వద్ద ఉన్న ‘హైడ్రా’ నేమ్ బోర్డులను సిబ్బంది తొలగించారు. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట్‌లోని సుమారు ఏడు ఎకరాల స్థలం విషయంలో ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి, ప్రభుత్వానికి మధ్య గత కొంతకాలంగా న్యాయపోరాటం నడుస్తోంది. ఈ స్థలం తన వ్యక్తిగత ఆస్తి అని, ఇది ఎప్పుడూ కుంట (నీటి వనరు) కాదని సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. అయితే ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టిందని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా భావించిన హైడ్రా.. ఇక్కడ సుమారు ఐదు ఎకరాల్లో చిల్డ్రన్స్ పార్కు, ఓపెన్ ఎయిర్ జిమ్, వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసి సుందరీకరించింది. గతేడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.