పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాంలో కేవలం 30 శాతం నిధులు మాత్రమే ఖర్చు పెట్టారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రభుత్వం 2015లో జీవో ఇచ్చి 2022లో డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక) సమర్పించిందని ఆయన వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం పెట్టిన శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు వాటర్ సోర్సును మార్చడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరంపై రూ.90వేల కోట్లు ఖర్చు చేసినవారు(బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో) పాలమూరుకు రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు ప్రాజెక్టులో ఒక మోటార్ ఆన్ చేసి జాతికి అంకితం చేశామని ప్రకటించారన్నారు. కేసీఆర్ మోటార్ ఆన్ చేసిన తెల్లారే మళ్లీ ఆఫ్ చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణా నది ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ. 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి పాలమూరును నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.
పాలమూరు అంచనాలు 1.5 టీఎంసీ నుంచి 1 తగ్గించారు : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేలా అంచనాలు పెంచుకుంటూ పోయారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరులో మాత్రం 1.5 నుంచి ఒక టీఎంసీకి తగ్గించారన్నారు. జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీలు తరలించే అవకాశం ఉండేదని వివరించారు. 60 రోజుల్లో 121 టీఎంసీలు తీసుకునేవాళ్లమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వాటర్ సోర్స్ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల 68 టీఎంసీల స్థాయికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయకట్టు కాల్వల ప్రస్తావన, భూసేకరణ లేకుండానే డీపీఆర్ను రూపొందించారని బీఆర్ఎస్పై మండిపడ్డారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959