భారత్‌ సహనం నశిస్తుంది..బ్రహ్మోస్‌ క్షిపణులు ఒకదాని తర్వాత ఒకటి ఆ దేశంపైకి దూసుకుపోతాయి జాగ్రత్త..మిథున్‌ చక్రవర్తి.

సింధూ జలాల ఒప్పందం (Indus River) నిలిపివేత విషయంలో పాకిస్థాన్‌ (Pakistan) తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఓర్వలేక అణు బెదిరింపులకు తెరలేపింది…తాజాగా ఆ దేశ విదేశాంగశాఖ మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో (Bilawal Bhutto) కూడా తీవ్రమైన హెచ్చరికలు చేశారు. దీనిపై సినీనటుడు, భాజపా నేత మిథున్‌ చక్రవర్తి (Mithun Chakraborty) ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే భారత్‌ సహనం నశిస్తుందని అన్నారు. అప్పుడు బ్రహ్మోస్‌ క్షిపణులు ఒకదాని తర్వాత ఒకటి ఆ దేశంపైకి దూసుకెళ్తాయని హెచ్చరించారు.

భారత్‌ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో తమ దేశానికి పెద్ద నష్టం జరిగిందని భుట్టో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పాక్‌కు చాలా నష్టం కలిగించాయి. మన ప్రజలంతా ఐక్యంగా ఉండాలి. వారి దురాక్రమణలకు వ్యతిరేకంగా కలిసి నిలబడాలి’ అని అన్నారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగితే.. పాక్‌ యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరు నదులు తిరిగి పొందేందుకు తమ పౌరులంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

అసీం మునీర్‌ లాడెన్‌ లాంటి వాడు..: పెంటగాన్‌ మాజీ అధికారి మండిపాటు
భవిష్యత్తులో భారత్‌ సిందూర్‌ లాంటి ఆపరేషన్ చేపడితే.. తమ దేశంలోని ప్రతి ఒక్కరూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని బెదిరింపులకు పాల్పడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ సింధూ నదీ జలాల ఒప్పందంపై వ్యాఖ్యల అనంతరం భుట్టో ఇలా మాట్లాడారు. నదీ జలాలను అడ్డుకోవడానికి భారత్‌ ఆనకట్టలు కడితే పేల్చేస్తామని, తమ దేశ మనుగడకు ప్రమాదం ఏర్పడితే సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామంటూ మునీర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా స్పందించింది. అణు బెదిరింపులకు భయపడేది లేదని, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది..