ఆ కేసులో అప్రూవర్‌గా మారుతా: నటి జాక్వెలిన్‌

ఆర్థిక మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీకి అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని కోర్టు ఆమెకు సూచించింది. ఈ కేసులో జాక్వెలిన్‌పై ఉన్న క్రిమినల్‌ విచారణను రద్దుచేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది..

సూచించింది. నిబంధనల ప్రకారం జాక్వెలిన్ అప్రూవర్‌గా మారాలనుకుంటే మొదట దర్యాప్తు సంస్థ అయిన ఈడీకి అభ్యర్థన పంపాల్సి ఉంటుంది. గతేడాది సెప్టెంబర్‌లో తనపై నమోదైన మనీలాండరింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ జాక్వెలిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె అప్రూవర్‌గా మారేందుకు ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుకేశ్ నేర చరిత్ర గురించి తనకు తెలియదని, తానూ అతని చేతిలో మోసపోయానని జాక్వెలిన్ మొదటి నుంచి వాదిస్తున్నారు.

ఈడీ జాక్వెలిన్‌ను ఈ కేసులో సహ నిందితురాలిగా పేర్కొంటూ 2022 ఆగస్టులోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సుకేశ్ ఒక నేరస్థుడని తెలిసి కూడా అతని నుంచి రూ.7 కోట్లకు పైగా విలువైన ఆభరణాలు, కార్లు, ఖరీదైన వస్తువులను బహుమతులుగా స్వీకరించారని ఈడీ ఆరోపిస్తోంది. సుకేశ్ అరెస్ట్ అయిన తర్వాత జాక్వెలిన్ తన ఫోన్‌లోని డేటాను తొలగించారని, మొదట్లో ఆర్థిక లావాదేవీల వివరాలను దాచిపెట్టి, ఆధారాలు చూపించాక అంగీకరించారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం పలు కేసుల్లో సుకేశ్ చంద్రశేఖర్ జైలులో ఉన్నాడు.