కొట్లాడితే ధీరుడితో కొట్లాడుతా.. రండలతో ఏం కొట్లాడను: ఈటల రాజేందర్.

ఈటల ఇంటిని ముట్టడించే యత్నం..మేడ్చల్ ఎంపీ, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అందుకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఈటల రాజేందర్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు..

జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాస్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) గతంలో ధనిక రాష్ట్రమని చెప్పిన రైతులకు రూ.లక్ష కూడా రుణమాఫీ చేయలేకపోయారని ఆరోపించారు. కేసీఆర్ (KCR) విచ్చలవిడిగా అప్పులు చేసిన రైతుబంధు (Raitubandhu) ఇచ్చారని కామెంట్ చేశారు. ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ (Six Guarantees)ల అమలు కష్టమని ఆనాడే చెప్పానని అన్నారు.

ప్రజలకు అబద్ధాలే నచ్చుతాయని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారని గుర్తు చేశారు. సరిగ్గా 16 నెలలు గడిచే సరికి రేవంత్ చెప్పిన అబద్ధాలు అక్షరాల నిజం అవుతున్నాయని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలో నిరుపేదల ఇళ్లను కూల్చేస్తున్నారని.. అదేంటని ప్రశ్నిస్తే ఇదే సీఎం ఎవరు అడ్డొచ్చినా బుల్డోజర్లతో తొక్కిస్తామని కామెంట్ చేశారని తెలిపారు. అప్పుడు తాను ‘ఎవరు చెప్పినా వినని వాడిని నాయకుడని అనబోరని.. మనిషి అనరని సైకో అంటారని’ కామెంట్ చేసినట్లుగా ఈటల క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే తనపై కాంగ్రెస్‌ (Congress)లో ఉన్న కొంతమంది చిల్లరగాళ్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, తాను కొట్లాడితే.. ధీరుడితో కొట్లాడుతానే తప్ప రండలతో ఏం కొట్లాడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏదో మార్పు తీసుకొస్తారని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని.. కానీ, వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందని ఈటల రాజేందర్ అన్నారు.

సీనియర్ కాంగ్రెస్ నేతలకు సోయి ఉందా..

సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలపై మండిపడిన యూత్ కాంగ్రెస్ నేతలు ఎంపీ ఈటల ఇంటి ముట్టడికి తరలివచ్చారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎంపీ ఈటల ఇంటికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. కలెక్టరేట్లు, కార్యాలయాలను ముట్టడిస్తారని, ఎవరైనా ఇళ్లను మట్టడిస్తారా అని గరం అయ్యారు. అసలు సీనియర్ కాంగ్రెస్ నేతలకు సోయి ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, అధికారంలో లేనప్పుడే కొట్లాడిని చరిత్ర బీజేపీ పార్టీదని ఈటల రాజేందర్ అన్నారు.