అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్ పై చర్యలు తీసుకోవాలి..

సునంద రైస్ మిల్లు వద్ద నిరసన..

రూ.22 కోట్ల నష్టం జరిగిందని ఆరోపణలు..

లైసెన్స్ రద్దు చేసి శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్ చేయాలని mrps ఆధ్వర్యంలో నిరసన…

గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌లో ఉన్న సునంద రైస్ ఇండస్ట్రీస్ ముందు MRPS, జై భీమ్ కమిటీతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. MRPS గరిడేపల్లి మండల అధ్యక్షుడు కొత్తపల్లి రవి నేతృత్వంలో పలువురు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సునంద రైస్ మిల్లులో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని గతంలోనే కలెక్టర్, సివిల్ సప్లైస్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి, MRO, MPDO, గ్రామపంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.
ఇటీవల విజిలెన్స్, సివిల్ సప్లైస్ అధికారుల తనిఖీల్లో సుమారు 8,000 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం గల్లంతైనట్లు, దీనివల్ల ప్రభుత్వానికి రూ.22 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మిల్లు భాగస్వాములు, అకౌంటెంట్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయాన్ని ప్రస్తావించారు.
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా నాణ్యత లేని బియ్యం సరఫరా చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.