హైదరాబాద్‌ను హడలెత్తించిన మూసీ వరద ప్రవాహం ఆదివారం తగ్గుముఖం పట్టింది. అయితే వరద తగ్గిన అనంతరం పరిసర కాలనీలు బురద, వ్యర్థాలతో నిండిపోయాయి. జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సహాయ బృందాలు రహదారులను శుభ్రం చేశాయి. జేసీబీలు, టిప్పర్లు, నీటి ట్యాంకులు, వందలాది మంది సిబ్బంది పాల్గొని వ్యర్థాలను తొలగించారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు అల్పాహారం, భోజనం, తాగునీటిని అందించారు. అయినప్పటికీ దుర్గంధం ఇంకా ఆయా కాలనీలను వీడలేదు. ఎండలు కాస్తేగానీ వరద బాధిత కాలనీల్లోని మురుగు వాసన పోదని, అప్పటి వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ వెల్లడించింది. నార్సింగి వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్లు, గౌరెల్లి వంతెన, మంచిరేవుల కాజ్‌వేలపై ఎప్పటిలాగే రాకపోకలు మొదలయ్యాయి…
పురానాపూల్, చాదర్‌ఘాట్ వంతెనల పక్కనున్న ఆలయాల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. మూసానగర్, రసూల్‌పురా, కమలానగర్, అంబేడ్కర్ నగర్‌లోని వరద బాధిత ప్రజలు నిత్యావసరాలు, తాగు నీటి సమస్య ఉందని వాపోయారు. ఎంజీబీఎస్ పరిసరాలను శుభ్రం చేసి కార్యకలాపాలను పునరుద్ధరించారు. హైదరాబాద్ నగరంలోని అన్ని వైపుల నుంచి మధ్యాహ్నం బస్సులు బస్టాండుకు పయనమయ్యాయి. దాంతో కాచిగూడ, కోఠి రోడ్లు కిక్కిరిసిపోయాయి..
ప్రారంభమైన ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు : నిన్న(శనివారం) మూసీ వరదలో చిక్కుకున్న ఎంజీబీఎస్ తేరుకుంది. బస్టాండ్ ఆవరణలో పేరుకుపోయిన బురదను పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. త్వరితగతిన సహాయ చర్యలు చేపట్టి తిరిగి ఆర్టీసీ బస్సు సేవలను అధికారులు ప్రారంభించారు. ప్రయాణికులు ఎవరూ ఇబ్బందులు పడకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. బస్టాండ్‌లో వరద కారణంగా శనివారం ఊర్లకు వెళ్లలేకపోయినా ప్రయాణికులు, తాజా సర్వీసులు ప్రారంభం కావడంతో ప్రయాణికులు సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. దసరా పండక్కి ఊరెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ కళకళలాడుతోంది..
మూసీ వరదల్లో చిక్కుకున్న బస్తీల్లో నుంచి శనివారం సాయంత్రం వరద వెనక్కుపోవడం మొదలైంది. ఆదివారం ఉదయం ప్రజానీకం మెల్లమెల్లగా ఇండ్లల్లోకి తిరిగి చేరుకుంటున్నరు. ఇప్పటికీ కొన్ని ఇండ్లు తాళాలు పడే ఉన్నయి. తలుపు తెరిచి చూస్తే ఏమీ మిగల్లేదని బాధితులు వాపోతున్నారు. ఇండ్లల్లోని సామాన్లు, వస్తువులు బురదపాలైపోయాయని విలపిస్తున్నారు. బురదను ఎత్తిపోస్తూ పిల్లాజెల్లా కష్టపడుతున్నారు. ఇల్లు, వాకిలిని శుభ్రం చేసుకునేందుకు కూడా నీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద వదులుతున్నట్టు ముందే చెప్తే సామాన్లయినా కాపాడుకునేటోళ్లం కదా అని ప్రజలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ‘మమ్మల్ని ఈడికెల్లి తరమాలనుకున్నరు గవర్నమెంటోళ్లు. అందుకే మా బతుకుల్లో బురద గొట్టిన్రు’ అని అనని తల్లి లేదు. ‘సీఎం రేవంత్‌రెడ్డి మా గురించి ఏం ఏమైనా ఆలోచిస్తున్నడా? మా బాధ గురించి ఏమైనా పట్టించుకుంటున్నడా?’ అని నిలదీస్తున్నారు. వరద ఉధృతికి దెబ్బతిన్న ఇండ్ల ఆనవాళ్లు కోల్పోవడంతో.. అక్కడ ఉండలేక దూరంగా ఫుట్‌పాత్‌ల మీద, ఇండ్ల అరుగుల మీద బతుకులు వెళ్లదీస్తున్నారు.
ఇండ్లు,సామాన్లు పుస్తకాలు తడిసిపోయినయ్..!
బస్తీల్లో ఉండే కిరాణా షాపులు, టైలరింగ్ షాపులు, చేతి వృత్తుల వాళ్ల సామాగ్రి పూర్తిగా నీటిపాలైంది. వీధుల్లో పార్క్ చేసిన వేలాది వాహనాలు పనిచేసే పరిస్థితిలేదు. వాహనాలే జీవనాధారంగా ఉన్న బస్తీ ప్రజలకు ఉపాధి లేకుండాపోయింది. ఇండ్లలో నుంచి మెకానిక్ షెడ్లలో నుంచి చాలా వాహనాలు మూసీ వరదలో కొట్టుకుపోయాయి. తమ వాహనాలు తిరిగి అప్పగించాలని యజమానులు మెకానిక్‌లను డిమాండ్ చేస్తున్నరు. మూసీ పరీవాహకంలోని దోబీ ఘాట్లలో కూడా ఇదే సమస్య నెలకొంది. రజకులు మూటలు కట్టి దాచుకున్న దుస్తులన్నీ వరదకు కొట్టుకుపోయాయి. లాడ్జ్‌ల దుప్పట్లు, కవర్లు, ఫంక్షన్ హాల్ స్క్రీన్లు మూసీలో కొట్టుకుపోయా. వాటిని అప్పగించాలని దోభీలతో హోటల్ యజమానులు ఘర్షణకు దిగుతున్నారు. విపత్తులో నష్టపోయిన తమకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మూసీకి సమీపంలోని ఇండ్లలోని గొర్రెలు, కోళ్లు, బాతులు నదిలో కొట్టుకుపోయినయి…మూసానగర్‌లో ఒక్కసారిగా మూసీ ముంచెత్తడంతో ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఆదివారం వరద ఉధృతి తగ్గడం, ఇండ్లలో నీరు బయటకు పోవడంతో ప్రజలు సామాన్లను, వస్తువులు, వాహనాలను శుభ్రం చేసుకుంటున్నారు. ఇలాంటి వరద ఎప్పుడూ చూడని చిన్నారులకు ఏం జరిగిందో కూడా అర్థం కావడంలేదు. ఆడుతూ పాడుతూ తిరిగిన కాలనీలు నదిలో ఎందుకు మునిగిపోయాయో అంతుపట్టడంలేదు. వదర ఎందుకు వచ్చిందో తెలియని విద్యార్థులు… తల్లిదండ్రులతో కలిసి బిక్కుబిక్కుమంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తమ పుస్తకాలను చూసి విలవిల్లాడిపోతున్నారు. తడిసిపోయిన పుస్తకాలను అరబెట్టుకుని, కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆదివారం మూసానగర్‌లో ఏ ఇంటి వద్ద చూసినా.. ‘పుస్తకాలు తడిసిపోయినయ్’ అంటూ అమాయకంగా చెప్పే చిన్నారుల మాటలు చూపరుల హృదయాలను కదిలించాయి..