నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామ శివారులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వనం మదర్ పొలంలో వరి కోత యంత్రం పని చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే యంత్రం నుంచి కిందికి దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించి వరి కోత యంత్రం పూర్తిగా దగ్ధమైంది.
డ్రైవర్ సమాచారం అందించడంతో యంత్రం యజమాని కోట్ల నాగయ్య ఘటనాస్థలానికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఇదిలా ఉండగా, పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని స్థానికులు తెలిపారు. అయితే యంత్రం పూర్తిగా కాలిపోవడంతో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు..
షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదం రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది…