అడవుల్లో తిరిగే వన్యప్రాణులు, ఆహారం కోసము, త్రాగునీరు కోసమో, రోడ్డు దాటుతుంటాయి. అటువంటి సమయంలోనే వాహనం దారుల అతివేగంతో వన్యప్రాణాల జీవాన్ని హరించి వేస్తున్నారు..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధి నుంచి హైదరాబాద్-శ్రీశైలం రహదారి వెళ్తుంది. దట్టమైన అడవిలో ఉండే వన్యప్రాణులు రహదారి దాటుతుండగా వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొని అక్కడికక్కడే మరణిస్తున్నాయి..
ఐదేండ్లలో 800 ప్రాణులు మరణం..
హైదరాబాద్ -శ్రీశైలం రహదారిపై మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు సుమారు 70 కి.మీ నల్లమల అటవీ ప్రాంతం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి రాగానే నిబంధనల మేరకు వాహనాలను గంటకు కేవలం 30కి.మీ వేగంతోనే నడపాలి. కానీ, వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. దీంతో అడ్డుగా వచ్చే వన్యప్రాణులు వాహనాల కింద పడి మరణిస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు ఐదేండ్లలో సుమారు 800పైగా వన్యప్రాణులు వాహనాల కిందపడి చనిపోయినట్టు అటవీశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. రికార్డుల్లోకి రానివి ఇంకా ఎన్నో ఉన్నట్టు సమాచారం.
బ్రేకులు వేయని సూచిక బోర్డులు..
హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి నిత్యం వేలసంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. శని, ఆదివారాలతోపాటు ఇతర సెలవు రోజుల్లో రద్దీ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. వాహనాల వే గాన్ని తగ్గించేందుకు అటవీమార్గంలో సూచిక బోర్డులతోపాటు 35చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పా టు చేశామని అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడా సూచిక బోర్డులున్నా వాహనాల వేగానికి బ్రేక్ పడటం లేదు. నిర్ణీత వేగానికి మించి వాహనాలు దూసుకెళ్తుండటంతో నల్లమలలోని పులులు, చిరుతలు, జింకలు, అరుదైన మూషికజింకలు, సరీసృపాల వంటి అమూల్యమైన జంతుసంపదకు ముప్పుగా పరిణమిస్తున్నది. వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించడంతోపాటు, వేగానికి కళ్లెం వేసేందుకు స్పీడ్గన్లను ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.