రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే ఆంక్షలు భారత్‌కు ‘నాటో’ చీఫ్‌ వార్నింగ్‌..!

రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూ, అక్కడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తాము 100 శాతం ద్వితీయ ఆంక్షలు విధిస్తామని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) చీఫ్‌ మార్క్ రుట్టే…భారత్‌, చైనా, బ్రెజిల్ నేతలకు హెచ్చరిక జారీ చేశారు. దీనికితోడు శాంతి చర్చలలో పాల్గొనేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయాలనే అమెరికా ఒత్తిడి మేరకు ‘నాటో’ చీఫ్‌ ఈ ప్రకటన చేశారు. ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి, శాంతి చర్చలకు రావాలని కోరారు. మరోవైపు రష్యాకు సహాయం చేస్తున్న దేశాలపై 500% వరకు సుంకాల బిల్లును అమెరికా సెనేటర్లు వెనక్కి తీసుకున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. దీంతో ఆంక్షలు విధిస్తే, భారత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి…బ్రెజిల్, చైనా, భారత్‌లు ఇకపై రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు నూతన ఆయుధాలు సమకూర్చడంతో పాటు, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కఠినమైన సుంకాలు విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన దరిమిలా మార్క్ రుట్టే ఈ విధంగా వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు.. ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ, వారి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ ఉంటే వారిపై 100 శాతం ద్వితీయ ఆంక్షలు విధిస్తానని మార్క్ రుట్టే హెచ్చరించారు. మాస్కోతో శాంతి చర్చలు అ‍త్యంత ప్రధానమైనవిగా పరిగణించాలని మార్క్ రుట్టే కోరారు.

ప్రస్తుతం, చైనా, భారత్‌, టర్కీలు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసే దేశాలలో టాప్‌లో ఉన్నాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఒకవేళ అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధిస్తే, ఈ దేశాలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ చర్య ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే ఇప్పటికే అస్థిరంగా ఉన్న ఇంధన ధరలు మరింత భారం అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు…