నేపాల్లో కురిసిన అసాధారణ కుండపోత వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. రుతుపవనాల తీవ్రతకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు ఆకస్మిక వరదలు , కొండచరియలు విరిగిపడటానికి కారణమయ్యాయి. రాజధాని ఖాట్మండు లోయతో పాటు తూర్పు, మధ్య నేపాల్ పరిధిలోని పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక నగరాలు, గ్రామాలు నీటమునిగి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది..
యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదికల ప్రకారం భూమి లోపల సంభవించిన మార్పులు, కొండచరియలు విరిగిపడిన తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. కొండచరియలు విరిగిపడటానికి ముందు సంభవించిన చిన్నపాటి భు qప్రకంపనలే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. భయంకరమైన వరదల తాకిడికి కొండచరియలు విరిగిపడి ఇళ్లు, రహదారులు కొట్టుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు.
టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఉప్పొంగి వచ్చిన వరద ప్రవాహంలో వేలాది మంది ప్రజలు కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతోంది. ప్రధానంగా రసువా జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఈ ప్రాంతంలో సందర్శనకు వచ్చిన దాదాపు 400 మందికి పైగా పర్యాటకులు ఆచూకీ లేకుండా పోయారు. వారిలో 300 మందికి పైగా విదేశీయులు కాగా, అందులో 105 మంది భారతీయ పౌరులు ఉన్నట్లు సమాచారం అందుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరద ఉధృతికి అనేక గ్రామాలు మ్యాప్లోనే లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి…విపత్తు తీవ్రత ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలు చేపట్టడం సవాలుగా మారింది. నిటారైన కొండ ప్రాంతాలు, తెగిపోయిన రహదారుల కారణంగా సైన్యం నేలమార్గంలో వెళ్లలేకపోతోంది. అయినా సరే నేపాల్ సైన్యం, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేశాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 12 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఈ ఆపద సమయంలో పొరుగున ఉన్న భారతదేశం కూడా నేపాల్కి సహాయంగా సైనిక బలగాలను, రెస్క్యూ హెలికాప్టర్లను పంపించి మానవత్వాన్ని చాటుకుంది. వరదలు, భూకంపం ధాటికి నేపాల్ అస్తవ్యస్తంగా మారింది. గల్లంతైన భారతీయ పర్యాటకులు సురక్షితంగా తిరిగొస్తారని వారి కుటుంబసభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాబోయే గంటలు బాధితుల ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలకమని రెస్క్యూ బృందాలు వెల్లడిస్తున్నాయి..