ముప్పు ఎదురైతే కనీసం కొన్ని నిమిషాల ముందైనా ప్రజలను అప్రమత్తం చేయాలని చర్యలు చేపట్టేవాళ్లం.. నేపాల్..

హిమాలయాల కొండల్లో.. సునామీ విరుచుకుపడిన వరద నేపాల్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. మంచు, మట్టి, రాళ్లతో ఉప్పొంగిన వరద ప్రవాహం గ్రామాలను, రహదారులను, వంతెనలను మింగేసింది..వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వారం గడిచినా కూడా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఇంతటి విపత్తు తర్వాత ఇప్పుడు నేపాల్‌ కళ్లు తెరిచింది. మరోసారి ఇలాంటి ముప్పు ఎదురైతే కనీసం కొన్ని నిమిషాల ముందైనా ప్రజలను అప్రమత్తం చేయాలని చర్యలు మొదలుపెట్టింది.

ఆగష్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలపై చైనా తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది నేపాల్‌ ప్రధాన ఆరోపణ. అయితే తాము సకాలంలోనే స్పందించామని చైనా ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ తరుణంలో రసువా జిల్లాలో ఎక్కడైతే వరద ముంచెత్తిందో.. అక్కడే కొత్తగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్‌ నిర్ణయించింది. చైనా సరిహద్దుకు సమీపంలోని టిమురే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, నదుల ఉద్ధృతి వంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు సీస్మిక్‌ సెన్సర్లు, కెమెరాలు ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు ఉపగ్రహ ఆధారిత వీఎస్‌ఏటీ (VSAT) కమ్యూనికేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.

పాత వ్యవస్థ ఏమైంది?..

ఇక్కడే అసలు వైఫల్యం బయటపడుతోంది. గతంలోనూ ఆ ప్రాంతంలో వరదలు, నదీ ప్రవాహాన్ని పర్యవేక్షించే వ్యవస్థ ఉంది. అయితే ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలో పలు పర్యవేక్షణ కేంద్రాలు, గేజ్‌లు కొట్టుకుపోయాయి. చైనా సరిహద్దుకు సమీపంలోని కనీసం నాలుగు గేజింగ్‌ స్టేషన్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో సమాచారం అందించడంలో వ్యవస్థ విఫలమైంది..