నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌾పంచాంగం🌾
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 06 – 04 – 2025,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,

తిథి : *నవమి* రా11.38 వరకు,
నక్షత్రం : *పునర్వసు* ఉ10.00 వరకు,
యోగం : *సుకర్మ* రా10.53 వరకు,
కరణం : *బాలువ* మ12.04 వరకు,
తదుపరి *కౌలువ* రా11.38 వరకు,

వర్జ్యం : *సా6.00 – 7.36*
దుర్ముహూర్తము : *సా4.32 – 5.21,*
అమృతకాలం : *ఉ7.38 – 9.12,*
మరల *తె3.36 – 5.13,*
రాహుకాలం : *సా4.30 – 6.00,*
యమగండం : *మ12.00 – 1.30,*
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 5.55,
సూర్యాస్తమయం: 6.10,

*_నేటి విశేషం_*

*శ్రీరామనవమి*
రామకృష్ణావతారాలు శ్రీమన్నారాయణుని సంపూర్ణావతారాలు, ఇందులోనూ సీతారామ లక్ష్మణులు అన్ని విధాలా మనకు ఆదర్శప్రాయులు.

పాతివ్రత్యానికి సీత, పితృవాక్యపరిపాలనకూ, ధర్మాచరణకూ, సత్యసంధతకూ, ఏకపత్నీవ్రతనిష్ఠకూ శ్రీరాముడూ, సోదరత్వదీక్షకూ, పరదారావిముఖతకూ, త్యాగనిరతికీ సౌమిత్రి – చిరస్థాయిగా నిల్చినారు.

శ్రీరాముని దివ్యచరిత్రను కీర్తించిన వాల్మీకి ప్రపంచ వాఙ్మయంలో ఆది కవిగా, శ్రీమద్రామాయణం – ఆది కావ్యంగా ఆరాధ్యమూర్తులయ్యాయి.

శ్రీరామునివంటి ఉత్తమగుణసంపన్నుడు మరొకడు లేడని వాల్మీకియే గాదు, విశ్వమంతా ముక్త కంఠంతో కీర్తించి, ప్రశంసించింది.
ఆ మహాగుణ సంపద దేశ కాలాలకు అతీతంగా సృష్టివున్నంతకాలం స్థిరంగా వుంటుంది.

సద్గుణసంపదతో రమించువాడూ, ప్రజలను సంతోషపెట్టువాడూ కనుక ఆ మహాత్మునికి రాముడన్న పేరు సార్థకమయ్యింది.
ఈ రెండు శక్తులున్నవారు రామునివలె ఆదర్శవ్యక్తులూ, ఆరాధ్యమూర్తులూ కావడంతో సంశయం లేదు.
రాముడు భారతీయులకే గాదు – మానవ జాతికే ఆదర్శమూర్తి!

మానవజాతిని తీర్చిదిద్ది, ధార్మిక జీవనం ఎంత మహత్త్వపూర్ణమో, ఎంత విశిష్టమైనదో, ఎంతో ఆదర్శవంతమైనదో తన ప్రవర్తన ద్వారా నిరూపించిన మహాత్ముని జన్మదినమే శ్రీరామనవమి! ఇదే శ్రీరామ జయంతి.
ఇట్టి వారి జయంతులు జరుపుకొని, వారి జీవితాన్ని మననం చేసుకొని అందరి సత్యధర్మాలను ఆదర్శంగా స్వీకరించి, యథాశక్తిగా దీక్షతో ఆచరిస్తానని దృఢ ప్రతిజ్ఞ చేసి, ఆచరించడానికి ఫలం దక్కుతుందికాని, ప్రసాదం స్వీకరించి, తృప్తిపడితే చాలదు.

చైత్రశుద్ధనవమినాడు ఆచరించే శ్రీరామనవమి యందు పునర్వసు లేదా దాని ముందటి పుష్యమి అయినా వుంటుంది.
సౌరమానం రీత్యా ఆచరించే శ్రీరామనవమి కూడా కొన్ని వేళల్లో వైశాఖ శుద్ధంలో రావడం వల్ల ఆ దినం ఆశ్లేష, మఖ, పుబ్బలలో ఏదో వొకటి అయివుంటుంది.
అంతేకాని పునర్వసులేదా పుష్యమి అయివుండదు.

రవి మీనరాశిలో వున్నా, మేషరాశిలో వున్నా చైత్రశుద్ధనవమినాడు మాత్రం పునర్వసు లేదా పుష్యమి నక్షత్రం ఉండటం విశేషం, (కనుకనే తిరుమలలో చాంద్రమాన శ్రీరామ నవమియే ఆస్థానం నిర్వహిస్తున్నారు.

సామాన్యంగా భారతీయులందరూ శ్రీరామ నవమిని యథాశక్తిగా ఆచరిస్తారు.
కాని ‘ఇతర పండుగలు’ మాదిరి అనేక భక్ష్యభోజ్యాలతో విందు భోజనాలతో ఈ పండుగను నిర్వహింపరు.
కేవలం బెల్లం, పానకం, నీరు, మజ్జిగ, పెసర బేడల వడపప్పు మాత్రమే నివేదించి, స్వీకరిస్తారు.
అందరికీ ఇస్తారు కూడా! ఇందులకు ఏదేని కారణం వుండక తప్పదు.

శ్రీరామనవమి చైత్రంలో వస్తుంది, ఇది మంచి వేసవికాలం, ఎండవేడిమికి శరీరం నిర్వీర్యమై, నిశ్శక్తిమంతమవుతుంది.
జీర్ణశక్తి సరిగా జరుగదు, శ్లేష్మం వసంతఋతువునందలి సూర్యకిరణాల వేడికి కలిగి, జఠరాగ్నిని మందగింపజేస్తుంది.
ఈ కాలంలో చెమట ఎక్కువ పస్తుంది.
ఇందువల్ల శరీరంలోని పోటాషియం, సోడియం లవణాలు తక్కువవుతాయి. ఇది ఆరోగ్యానికి ప్రతిబంధకం అవుతుంది.
దీన్ని సరిచేయడానికీ, మున్ముందు కలుగబోవు దుష్పరిణామాలను నిరోధించడానికీ ఆహారనియమాలు పాటించే ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఆయుర్వేదం ప్రకారం ఈ కాలంలో చలువ చేసే పదార్థాలూ, చల్లని పెసరపప్పు మున్నగు సేవిస్తే జీర్ణ కోశానికి సంబంధించిన అనారోగ్యం ఏర్పడదు, జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.

శ్రీరామనవమినాడు ఎక్కువగా పెసర బేడలు (వడపప్పు) నివేదించి ఇస్తారు.
పెసలు బుధగ్రహానికి చెందినవి, బుధుడు బుద్ధికారక గ్రహం, పెసరబేడలు సాత్త్వికాహారం కనుక బుద్ధిశక్తిని పెంచుతాయి, మంచి మనస్సును పెంచుతాయి.

ఎండాకాలంలో ఆరోగ్యానికి ఇబ్బంది కల్గించక, సుఖశాంతుల్ని చేకూరుస్తాయి.

జ్యోతిశ్శాస్త్రంరీత్యా చైత్ర శుద్ధ పూర్ణిమనాడు చంద్రుడు చిత్తా నక్షత్రంలో వుంటాడు.
చిత్త కుజ నక్షత్రం, కుజుడు అగ్నికారక గ్రహం.
చంద్రుడు సౌమ్యగ్రహం. జలగ్రహం, అగ్నికి నీరు పడితే అగ్ని చల్లారిపోతుందని.
అట్లే అగ్ని సమానమైన వేడిగల ఈ ఋతువులో తీవ్రతాపాన్ని తట్టుకొని, హాయిగా వుండటంకోసం పానకం, నీరు, మజ్జిగ, వడపప్పు మున్నగు చలువచేసే పదార్థాలు స్వీకరించడని శాస్త్రం చెప్పింది.

ఇలా ఆరోగ్యం పరిరక్షణ దృష్టిలో శ్రీరామ నవమినాడు పిండివంటలుగాక, వడపప్పు, పానకం, నీరు మజ్జిగ ఇవ్వడం ఆచార మయ్యింది.
ఇట్లే వైశాఖంలో వచ్చే నృసింహజయంతికి కూడా వడపప్పు, పానకం ఇస్తారు,

*ఆచరణ విధానం*
శ్రీరామనవమినాడు ఉపవాసం చేసి, పూజా ధికం నిర్వహించి, రాత్రి జాగరణ చేయాలని వ్రత గ్రంథాలు సూచించాయి.
నవమినాడు విష్ణువు రామావతారమెత్తినందున చైత్రశుద్ధ నవమీ తిథి “సర్వకామద’ (అన్ని కొర్కేలూ తీర్చునది) అయింది. నవమీ ఉపవాసం, రాత్రి జాగరణ చేసి, దశమినాడు నిత్యకర్మానుస్థానం గావించుకొని, భక్తిశ్రద్ధల్తో శ్రీరాముణ్ణిపూజించి, అన్న సంతర్పణ చేయాలి.
రామ భక్తులకు యథాశక్తిగా వస్త్రాలంకారాదులు భక్తితో సమర్పించాలి.
శ్రీరామనవమీవ్రతాచరణం అనేక పాపాల్ని పరిహరిస్తుంది. శ్రీరామప్రతిమా నిర్మాణాన్ని గూర్చి, ఎలా దానం చేయాలి అనే విషయాలు లింగపురాణం, రామార్చన చంద్రిక గ్రంథాల్లో కలదు. చైత్ర శుద్ధపాడ్యమి నుండి నవమి దాకా కొందరు శ్రీరామవసంతనవరాత్రులు నిర్వహిస్తున్నారు.
వీటిల్ని గర్భజయలత్యుత్సవాలంటారు.
కొందరు శ్రీరామ నవమినుండి తొమ్మిదిరోజులు ఆచరిస్తారు. వీటిల్ని జనన జయంతి ఉత్సవాలు అంటారు. రెంటిల్లోనూ తొమ్మిది రోజులూ శ్రీమద్రామాయణ పారాయణం, రాత్రులందు రామకథాకాలక్షేపం చేస్తారు. నవమి నాడు శ్రీరామజననవృత్తాంతం చదివి, విన్పించి, పూజలు నిర్వహిస్తారు. దశమినాడు శ్రీరామ పట్టాభిషేకం చేస్తారు.

కొందరు శ్రీరామనవమినుండి ‘రామకోటి’ వ్రాయడం ప్రారంభించి, మరల శ్రీరామనవమికి పూర్తి చేస్తారు. రామనామంలోని ఒక్క అక్షర మహా పాతకాలను హరిస్తుంది.

మన దేశాన్ని ఏకసూత్రంతో బంధించింది అనాదికాలం నుండి శ్రీరామచరితమే! కవలపిల్లలు పుట్టే రామలక్ష్మణులని పేరు పెట్టడం మన ఆచారం. భారతీయ జీవన విధానంలో రామచరిత్రం అంతర్లీన మైవుంది. రామకథ తెలియని భారతీయుడుండడు.

చైత్రమాసంలోనే మత్స్య, వరాహ, శ్రీరామ జయంతులు వస్తాయి. సంవత్సరంలో వచ్చే దశా వతార జయంతుల్లో మొట్టమొదటిది శ్రీరామ జయంతి.

శ్రీరామజయంతి ఆచరణకు పునర్వసుతో కూడిన చైత్ర శుద్ధనవమి చాలా విశిష్టమైనది. అష్టమి తో కూడిన నవమి శ్రీరామపూజకు పనికిరాదు. నవమి నాటి పూజ మధ్యాహ్నం 12.00 గం.లకు చేయాలి.

ఆంధ్రరాష్ట్రంలో శ్రీరామనవమినాడు సీతా రాముల కల్యాణం జరపడం ఆచారంగా వుంది. రామ జయంతి వలె ఫాల్గున శుద్ధ అష్టమి జానకీ జయంతి కూడ వున్నది.

మూడు మార్లు “రామ, రామ, రామ” అంటే 1000 మార్లు చెప్పినట్లవుతుంది. “కటపయాది వర్గ” సూత్రంలో “రా” య వర్గంలో రెండవ అక్షరం. ‘మ’ ప వర్గంలో ఐదవ అక్షరం. కాగా 2×5=10. ఒక “రామ” అంటే 10 అనే సంఖ్యకు సంకేతం. రామ రామ రామ =10x10X10=1000 అవుతుంది. కనుకనే శివుడు పార్వతికి “రామ రామ రామ” అని ముమ్మారు పల్కితే సహస్రనామో చ్చారణతో తుల్యమని ఉపదేశించినాడు. పైగా శివుడు తాను నిరంతరం జపించే రామ నామాన్నే పార్వతికి తెల్పినాడు.

ఇలా నామస్మరణమాత్రాన్నే సకల పాపాలను హరించి, సర్వ శుభాభ్యుదయాలూ కల్గించే రామనామం – ఆ పేరు గల రాముడూ అవతరించిన రోజును సాత్త్వికవిధానంలో జయంతి పర్వదినంగా భావించి రాముణ్ణి పూజించడం కంటే మానవజాతికి మహాసంపద మరేముంది.

ఋగ్వేదంలో శ్రీరాముని పవిత్రనామం స్మరింప బడింది. శతపథ బ్రాహ్మణం శ్రీరాముని సోదరుడైన భరతుని గాథను వర్ణించింది.

శ్రీరామనవమి – ఆధ్మాత్మిక మూర్తి “వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే। వేదః ప్రాచేతసా దాసీత్సాక్షాద్రామాయణాత్మనా” – వేద వేద్యుడైన పరమాత్మ దశరథనందనుడైన రాముడుగా జన్మించినాడు. వాల్మీకి ద్వారా వేదమే రామాయణ రూపంలో అవతరించింది అని ఆర్షవాక్యం. నిరాకారపరమాత్మ సాకారమైన తత్త్వం శ్రీరాముడు.
రామాయణం సాక్షాత్తూ వేదమే! రామః – అనగా పరమాత్మ అనీ అర్థముంది.
అందరి హృదయాల్లో ఆనందరూపుడై రమించువాడు – రాముడు. రామ నామం మధురాతిమధురం.
పల్కుటకేగాక, భావించి ఆనందించుటకూ రామనామం మహత్త్వపూర్ణమ యినది.

రాముడు అయోధ్యవాసులనే తరింపజేసినాడు. రామనామం త్రిలోకవాసులనూ తరింపజేస్తుంది.
నామికంటే నామమే గొప్పదని పేరుగాంచింది – రామ నామం!

శివుడు నిరంతరం జపించేది రామనామాన్నే! “ఓం నమోనారాయణాయ” అనే నారాయణాష్టాక్షరీ మంత్రంలో “రా” అనే ఐదవ అక్షరం, “ఓం నమశ్శివాయ” అనే శివపంచాక్షరీమంత్రంలోని “మః ” అనే రెండవ అక్షరం – చేర్తే “రామః” అవుతుంది.
ఈ రెండు మంత్రాలకు ఈ రెండక్షరాలూ ప్రాణం! “నారాయణాయ”లో “రా” లేనిచో “నాయనాయ” అగును. అపుడు “పొందుటకు వీలు లేదు” అని అర్ధం. “నమశ్శివాయ”లో “మః” లేనిచో “నశివాయ” = మంగళము కొరకు కాదు అంటే “అమంగళం కొరకు” అనే అర్థం వస్తూంది.
కనుక శివకేశవుల ఏకీకృతమూర్తి రాముడు. రెండు తత్త్వాలూ రామునిలో నిండివున్నాయి.

“ధర్మాత్మా సత్యసంధశ్చ” అంటూ రామునిపై వొట్టుపెట్టి లక్ష్మణుడు ప్రయోగించిన బాణం ఇంద్రజిత్తును సంహరించిన సంగతి రామాయణంలో ఉన్నది. రాముడ్ని ధర్మాత్మతకూ, సత్యసంధతకూ ఇదొక గొప్ప నిదర్శనం.

ఏకోణంలో చూచినా శ్రీరాముడు సామాన్యులకూ, మాన్యులకూ, యోగులకూ, త్యాగులకూ, మొత్తం విశ్వానికే ఆరాధ్యమూర్తి.

రామునితో సమానమైన మరో దైవంలేడని ఢంకా భజాయించి చాటి చెప్పిన కంచర్లగోపన్నమాట ముత్యాలమూట!

ఆదర్శమానవుడైన శ్రీరాముణ్ణి చక్రవర్తిగా, పురుషోత్తముడుగా, యోగీశ్వరుడుగా, పరమాత్మగా ఎవరు ఎలా భావిస్తే వారికి అలా సాక్షాత్కరించి, వారిని రక్షిస్తాడు – శ్రీరాముడు.

అందుకే అందరూ “రామరాజ్యం” కావాలని కోర్తుంటారు.

శ్రీరామతత్త్వాన్ని గూర్చి వ్రాయడం అలవికాని పని. శ్రీరామచరితామృతసరస్సులో మునిగి, రమిద్దాం!

॥ ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ॥

*_🌾శుభమస్తు🌾_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏