🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 13 – 11 – 2024,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
తిథి : ద్వాదశి ఉ10.02 వరకు,
నక్షత్రం : రేవతి రా1.44 వరకు,
యోగం : వజ్రం మ2.25 వరకు,
కరణం : బాలువ ఉ10.02 వరకు,
తదుపరి కౌలువ రా8.47 వరకు,
వర్జ్యం : మ2.35 – 4.04,
దుర్ముహూర్తము : ఉ11.21 – 12.06,
అమృతకాలం : రా11.30 – 1.00,
రాహుకాలం : మ12.00 – 1.30,
యమగండం : ఉ7.30 – 9.00,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 6.07,
సూర్యాస్తమయం: 5.21,
*_నేటి విశేషం_*
*క్షీరాబ్దిద్వాదశి / చిలుకు ద్వాదశి / సాగరమథన దివసం*
ఈ రోజు క్షీర సాగర మథనం జరిగిన రోజు, అంతే కాక యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీమహా విష్ణువు సకల దేవ రుషి, ముని గణాలకు దర్శనమిచ్చే పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు,
స్కాంద, పద్మపురాణాల ప్రకారం ఈ రోజు ధాత్రీ వృక్షం కింద లేదా ధాత్రీ వనంలో యధోక్త విధిగా తులసీ ధాత్రీ వివాహము జరిపి ఆ వనములో శక్తిననుసరించి పక్వాన్నములు చేసి లక్ష్మీనారాయణ స్వరూపులైన తులసీధాత్రులకు నివేదన చేసి బ్రాహ్మణులకు, బంధువులకు, పేదసాదలకు భోజనం పెట్టి శక్తి మేరకు గో, భూ, సువర్ణ దానాలను ఇచ్చి సత్కరించి వారి అనుమతితో తాము భుజించి ఆరోజు జాగరణ చేయాలి.
మరునాడు ఉదయమే స్నానమాచరించి కార్తిక శుద్ధ త్రయోదశినాడు దేవదేవున్ని ఆరాధించి కార్తిక శుక్లచతుర్దశినాడు వ్రత సమాప్తి చేయాలి.
*చిలుకు ద్వాదశి*
ఈ ద్వాదశినే చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తుంటారు.
కార్తిక ద్వాదశి రోజున గృహిణులు క్షీరాబ్ది వ్రతాన్ని ఆచరిస్తారు,
శ్రీమహా విష్ణువు ఈ ద్వాదశి రోజున తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి.
క్షీరాబ్ది శయన వ్రతంలో తులసిని, విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు.
సూర్యాస్తమయం తర్వాత స్త్రీలు తులసి కోటలో విష్ణువు పటాన్ని లేదా విగ్రహాన్ని గాని ఉంచి వ్రతం చేస్తారు.
ఈ రోజున విష్ణువు పరివార సమేతంగా తరలి వస్తాడు, కనుక తులసికోటనే బృందావనంగా భావించి తులసి, ఉసిరిక మొక్కల వద్దనే లక్ష్మీనారాయణులను పూజిస్తారు.
ఇందువల్ల వారికి సౌభాగ్యం, సుఖ సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు.
ఈ వ్రతాన్నే బృందావన ద్వాదశి వ్రతం అని వ్యవహరిస్తుంటారు.
చిలుకు ద్వాదశి రోజున తులసి కోట వద్ద కర్ర పాతి ఆకాశ దీపం వెలిగించాలనే శాస్త్ర వచనం కూడా ఉంది.
కార్తిక మాసంలో దీపా రాధనకు అధిక ప్రాధాన్యత ఉంది.
ఈ మాసంలో ప్రతి రోజు దీపారాధన తప్పనిసరి, ముఖ్యంగా శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమల్లో దీపారాధన మరింత శుభకరమని చెబుతారు.
ఇంకా చెప్పాలంటే సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయని దోషం ఈ రోజు 360 వత్తులతో ఉన్న దీపాన్ని వెలిగించడం వల్ల తొలగుతుంది.
ఇక్కడ గమనించవలసిన విషయం మరొకటి ఉంది, ఒకరు వెలిగించిన దీపం కొండెక్కుతూ ఉంటే దానిని తిరిగి వెలిగేలా చేసిన వారికి కూడా దైవానుగ్రహం కలుగుతుందని ఒక పురాణ వచనం.
ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడానికి తోడ్పడాలనేది దీనిలోని లౌకిక సందేశం.
*చాతుర్మాస్య వ్రత సమాప్తి*
ఇక చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించిన వారు ద్వాదశినాడు వ్రత సమాప్తి చేస్తారు.
*చతుర్థా గృహ్య వైజీర్ణం చాతుర్మాస్య వ్రతం నరః*
*కార్తిక శుక్ల పక్షేతు ద్వాదశ్యాంతు సమాపయేత్*
ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం ఈ నాల్గు మాసములు చాతుర్మాస్య వ్రతమును ఆచరించి కార్తిక శుద్ధ ద్వాదశినాడు వ్రతసమాప్తి చేయాలి. ‘నిర్ణయామృతము’ న సనత్ కుమారుడు సమాప్త మంత్రమును తెలియజేశాడు.
*ఇదం వ్రతం మయాదేవ కృతం*
*ప్రీత్యై తవ ప్రభో న్యూనం సంపూర్ణతాం యాతు* *త్వత్ ప్రసాదాత్* *జనార్దనా*
ద్వాదశి విధి బ్రహ్మపురాణంలో ఈవిధంగా చెప్పబడింది.
ఏకాదశినాడు రాత్రి దేవదేవున్ని మేలుకొలుపు అనంతరం రథంలో వేంచేయించి స్నానాది ఆరాధనలు ముగించిన తర్వాత నగరంలో నాలుగు వీధులలో ఊరేగించాలి.
చాతుర్మాస్య వత్రం ఆచరించిన వారు ఆ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు, బ్రాహ్మణులకు తాను ఆచరించిన చాతుర్మాస్య వ్రతమును నివేదించి దక్షిణాదులతో సత్కరించాలి.
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏