ఆన్‌లైన్‌లోనే అక్షింతలు.. అమెరికాలో పెళ్లి, వేపల్లె సింగారంలో విందు!..

ఆన్‌లైన్‌లోనే అక్షింతలు.. అమెరికాలో పెళ్లి, వేపల్లె సింగారంలో విందు!
సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ మండలం, వేపల్లె సింగారం:
సాంకేతికత పెళ్లి వేడుకలను కూడా కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన వేపల్లె సింగారం గ్రామానికి చెందిన చడపంగు జయరాజు, జ్యోతి దంపతుల ఏకైక కుమార్తె హిమబిందు వివాహం శుక్రవారం రాత్రి అమెరికాలో జరిగింది.
ఉద్యోగ రీత్యా అమెరికాలోనే స్థిరపడిన ఎన్‌టీఆర్ జిల్లా అన్నారం గ్రామానికి చెందిన కందుకూరి మస్తాన్‌రావు, రమ దంపతుల ప్రథమ కుమారుడు రోహిత్ కుమార్తో హిమబిందు వివాహం జరిగింది.
అయితే ఈ వివాహ వేడుకకు హాజరుకాలేని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దలు ఆన్‌లైన్ ద్వారా వివాహ వేడుకను వీక్షిస్తూ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆన్‌లైన్‌లోనే అక్షింతలు వేసి తమ ఆశీస్సులు అందించారు.
వివాహం అనంతరం వేపల్లె సింగారంలో బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, గ్రామ పెద్దల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. సాంకేతికతను వినియోగించుకుంటూ వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన పెళ్లి వేడుకలోనూ కుటుంబ సభ్యులు భాగస్వాములు కావడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.