అమెరికా ప్రయోజనాలు, కీలక ఇంధన మార్గాలపై ఎదురుదాడికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం..ఇరాన్ ప్రకటన..
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆదాయ మార్గాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కొత్త ఆంక్షలను ప్రకటించింది..అయితే ఈ చర్యలకు తాము భయపడబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. ఆంక్షలను ఎదుర్కొనేందుకు ‘పూర్తిగా సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించడంతోపాటు.. అవసరమైతే అమెరికా ప్రయోజనాలు, కీలక ఇంధన మార్గాలపై ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించింది.
అమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా చేస్తున్న ఆంక్షల బెదిరింపులను Operation Economic Outcast ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములు కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గబోరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. అమెరికా మరిన్ని దేశాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకునే స్థితిలో లేదని ఘలీబాఫ్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో వాణిజ్యం చేస్తున్న దేశాలు అమెరికా హెచ్చరికలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తమకు సమాచారం అందుతోందన్నారు. దీంతో ఆంక్షల విషయంలో అమెరికా ఒత్తిడికి దీటుగా దౌత్య, ఆర్థిక మార్గాల్లో ప్రతిఘటనకు ఇరాన్ సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
‘పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’
ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే అమెరికాకు మరింత ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ‘పూర్తిగా సిద్ధంగా ఉంది’ అని ప్రకటించారు. అమెరికా తమపై ఆర్థిక దాడికి దిగితే.. తమ వద్ద కూడా ప్రతిస్పందించేందుకు అవసరమైన సాధనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ”ఇక మేం కేవలం రక్షణాత్మక చర్యల కోసమే పరిమితం కాబోం. శత్రువులు మా నుంచి దాడిని ఎదురుచూడాల్సి ఉంటుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. చైనా, రష్యాలు అమెరికా తాజా చర్యలను అంగీకరించలేదని, ఇతర దేశాలు కూడా వాషింగ్టన్ ఒత్తిడికి తలొగ్గకపోవచ్చని మదానిజాదే పేర్కొన్నారు.