అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్..95 లక్షల ఫీజు మోతతో భారతీయ విద్యార్థుల గుండెల్లో గుబులు..!

అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకుని అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంతో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది..విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలోనే తాత్కాలికంగా పనిచేసుకునేందుకు అవకాశం కల్పించే ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’ (OPT) ప్రోగ్రామ్‌పై ఏకంగా లక్ష డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ. 95 లక్షలకు పైగా) భారీ ఫీజును విధించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఈ ప్రతిపాదన గనుక అమల్లోకి వస్తే, అమెరికాలో స్థిరపడాలని భావించే వేలాది మంది భారతీయ విద్యార్థులపై తీవ్రమైన ఆర్థిక భారం పడనుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

అమెరికా కలల సౌధానికి గ్రహణం? రూ.95 లక్షల ఫీజు మోతతో భారతీయ విద్యార్థుల గుండెల్లో గుబులు..

ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)పై భారీ ఫీజు బాంబు

విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు ఎంతో కీలకమైన ఓపీటీ పై ఏకంగా 1,00,000 డాలర్ల.. మన భారతీయ కరెన్సీలో సుమారు ₹95 లక్షలకు పైగా ఫీజు విధించే దిశగా ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాల్లో ప్రతిభ చాటుతూ చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేసి తీసుకున్న విద్యారంగ రుణాలను తీర్చుకుందామని భావిస్తున్న భారతీయులకు ఇది కోలుకోలేని దెబ్బ. చదువుకే లక్షలు ధారపోసిన కుటుంబాలు, చదువు పూర్తయ్యాక పనిచేసే హక్కు కోసం మళ్లీ కోటి రూపాయల దాకా ఫీజు చెల్లించడమంటే సజీవ నరకమే…

హెచ్-1బీ వీసాలపైనా అదే దెబ్బ

ఇది చాలదన్నట్లు విదేశీ నైపుణ్య నిపుణులను నియమించుకునే హెచ్-1బీ వీసాలపై కూడా కంపెనీలు చెల్లించాల్సిన రుసుమును $1,03,265కి పెంచేందుకు చట్రం సిద్ధమవుతోంది. దీనివల్ల భారతీయ ఐటీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికన్ కంపెనీలు వెనకాడే పరిస్థితి ఏర్పడుతుంది. కష్టపడి చదివినా.. ప్రతిభ ఉన్నా కేవలం ఈ భారీ రుసుముల భయం వల్ల అవకాశాలు చేజారిపోతాయేమోనని ప్రతిభావంతులు ఆందోళన చెందుతున్నారు.

బీ1/బీ2 వీసాలు, ఆశ్రయం దరఖాస్తులపై ఉక్కుపాదం..

మరోవైపు పర్యాటక, వ్యాపార వీసాలపై వచ్చి అనంతరం ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 2 లక్షల మంది వీసాలను రద్దు చేసేందుకు కూడా కసరత్తు జరుగుతోంది. 2016 నుండి 2026 మధ్య కాలంలో జారీ చేసిన బీ1/బీ2 వీసాలపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం దృష్టి సారించడంతో అక్కడ నివసిస్తున్న ఎంతోమంది విదేశీయుల్లో భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.