ఓయూకు వెళ్తా అన్నప్పుడు చాలా ధైర్యం చేస్తున్నారని అన్నారు…సీఎం రేవంత్..

ఓయూకు వెళ్తా అన్నప్పుడు చాలా ధైర్యం చేస్తున్నారని తనతో కొందరు అన్నారని, అక్కడ ప్రజాప్రతినిధులను అడ్డుకున్న చరిత్ర ఉందని చెప్పారని, తనది ధైర్యం కాదని, అభిమానం అని వారితో చెప్పానని రేవంత్ రెడ్డి తెలిపారు. గుండెల నిండా అభిమానం నింపుకుని ఓయూకు వచ్చానన్నారు. సీఎంగా తనకు చాలా సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎక్కడేం మాట్లాడాలో అధికారులే రాసిస్తారని తెలిపారు. అధికారులు ఇచ్చింది మాట్లాడితే ఓయూకు వెళ్లడం దండగ అని చెప్పానని, ఓయూని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే సంకల్పంతో వచ్చానని పేర్కొన్నారు…

డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్లి చదువుకోగలరని, పేదింటి విద్యార్థులకు మన ఉస్మానియా యూనివర్సిటీ నాణ్యమైన విద్యను అందించాలని, 1000 కోట్లు డబ్బుగా కాదు భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా చూస్తున్నామని తెలిపారు. వాళ్లు అనుకుంటున్నారేమో తనకు ఇంగ్లీష్ రాదని, చైనాకు ఇంగ్లీష్ రాదు కానీ అమెరికా కూడా చైనా ప్రొడక్షన్ ఆపేస్తే విలవిలలాడుతుందని తెలిపారు. భాష కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే అది నాలెడ్జి కాదని తెలిపారు. తనకు ఇంగ్లీష్ రాకపోతే 10 మంది భాష తెలిసిన వారిని ఉద్యోగంలో పెట్టుకుని మాట్లాడమంటానని అన్నారు. యూనివర్సిటీలో పోస్ట్ల భర్తీ కోసం వర్సిటీకే అధికారం ఇస్తున్నామని సీఎం తెలిపారు.

” ఓయూని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే సంకల్పంతో వచ్చా. విద్యాలయాల్లో కులవివక్ష ఉండకూడదనే యంగ్ ఇండియా స్కూల్స్‌. ఇంజినీరింగ్ చదివినవారికి ఉద్యోగాలు ఇప్పించడం కష్టంగా ఉంది. సర్టిఫికెట్ ఉంది కానీ నైపుణ్యాలు లేవు. 2036 లో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా మన విద్యార్థులను తీర్చిదిద్దాలి…

జార్జిరెడ్డి, గద్దర్ వంటి వీరులను అందించింది.

ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణలో పోరాటాలు వచ్చాయని, సామాన్యులైన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య దొరలపై పోరాడారని సీఎం గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగలేదని తెలంగాణ ఉద్యమం వచ్చిందని, ఉద్యమాన్ని ఉస్మానియా వర్సిటీ నుంచే విద్యార్థులు ప్రారంభించారని తెలిపారు. ఓయూ నుంచి ఎందరో విద్యార్థులు నక్సలిజం వైపు వెళ్లారని అన్నారు. జార్జిరెడ్డి, గద్దర్ వంటి వీరులను ఓయూ తెలంగాణకు అందించిందని కొనియాడారు..