కమిషన్ రిపోర్టులో కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు లేవు..?
ఎందుకు, ఎలా మాయం అయ్యాయి..?
తప్పు జరిగితే అందులో వారికి బాధ్యత లేదా.? : అక్బరుద్దీన్ ఒవైసీ
ప్రాజెక్ట్ కట్టిన కాంట్రాక్టర్ పేరు లేదంటే అది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కూర్చొని కేవలం కేసీఆర్ ని టార్గెట్ చేసి రాశారా??..
వేల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చివేస్తరా? నిలిపివేస్తరా? కొనసాగిస్తరా? అనేది ప్రభుత్వం స్పష్టంచేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజ్టెక్టుకు మరమ్మతు చేయాలని సూచించారు. జస్టిస్ ఘోష్ రిపోర్టులో కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు లేవని, వారికి డ్యామ్ డ్యామేజీలో బాధ్యత లేదా? అని ప్రశ్నించారు..సీఎస్ వంటి ప్రధాన అధికారులను ఎందుకు వదిలేశారని, నేరస్థుడు అప్రూవర్‌గా మారితే మంచివాడా? అని ప్రశ్నించారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ఘోష్ కమిషన్ రిపోర్టు సభలో పెట్టకముందే, క్యాబినెట్లో పెట్టకముందే మీడియాకు ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించారు. రూ.6.78 కోట్లు రికవరీ చేయాలని కమిషన్ రిపోర్టులో ఉన్నదని పేర్కొంటూ.. మరి ఏర్పాటుకు ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు.
కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ కాదు
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతమాత్రం వైట్ ఎలిఫెండ్ కాదని అక్బరుద్దీన్ చెప్పారు. ‘కాళేశ్వరం ద్వారా 18 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగినట్టు బుక్‌లో ఉన్నది.మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాళేశ్వరం పనికిరాదని, ప్రాజెక్టు నుంచి ఒక ఎకరానికి నీళ్లు రావని అంటున్నారు.. కానీ, మంత్రి శ్రీధర్‌బాబు ఇచ్చిన రిపె్లైలో మూసీ నదికి కాళేశ్వరం నుంచి నీళ్లు తెస్తామని అంటున్నారు.
ఈ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వీళ్లకే అర్థం కావడం లేదు’ అని మండిపడ్డారు. కెనాల్స్, టన్నెల్స్, ఇతర అనేక అంశాలు పటిష్ఠంగా ఉన్నాయని స్పష్టంచేశారు. 2007లో ప్రాణహిత చేవెళ్ల చేపట్టారని, 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిచేసి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే అవకాశం ఉండేది కాదని చెప్పారు. 20 నెలల నుంచి ఏం చేస్తున్నారు? రిపేర్ చేయవచ్చుగా? అని నిలదీశారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఉన్నాయని, కాళేశ్వరం ఎంతమాత్రం వైట్ ఎలిఫెంట్ కాదని స్పష్టంచేశారు.
అధికారులను ఎందుకు వదిలేశారు?
ప్రభుత్వంలోని కీలక అధికారుల పేర్లను నివేదికలో ఎందుకు పొందుపర్చలేదని అక్బరుద్దీన్ నిలదీశారు. ‘సీఎస్‌ను ఎందుకు బాధ్యుడిని చేయలేదు. వారిని అప్రూవర్‌గా మార్చుకున్నరు. వాళ్లని రక్షిస్తున్నారు. వారిని కూడా బయటపెట్టాలి. నవయుగ, ఎల్అండ్టీ, ఆఫ్రాన్స్ కంపెనీలు ప్రాజెక్టులో పాల్గొంటే.. ఒక్క ఎల్అండ్టీ పేరు మాత్రమే నివేదికలో ఎందుకు వచ్చింది? మిగతా కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు తీసుకురాలేదు? కాంట్రాక్టర్ల మీద కమిషన్ ఎందుకు మాట్లాడలేదు? కాంట్రాక్టర్లకు బాధ్యత లేదా? వాళ్లను కూడా బాధ్యులను చేయాలి?’ అని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష హోదాలో ఉన్న తమను అన్ని విషయాల్లో ప్రభుత్వం అడుగుతున్నదా? ఈ కమిషన్ విషయంలోనే ఎందుకు అడుతున్నారు? అని అక్బరుద్దీన్ నిలదీశారు. పెద్ద కాంట్రాక్టర్లను ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలని కోరారు. ‘సీఐజీ, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టులను పరిగణనలోకి తీసుకోలేదని కమిషన్ నివేదికలో స్పష్టంగా చెప్పింది. వాటిని ప్రభుత్వం ఎందుకు కమిషన్‌కు ఇవ్వలేదు? కమిషన్ చివరికి ఏం చెప్పింది? అంతిమ ఫలితం ఏమిటి?’ అని అక్బరుద్దీన్ నిలదీశారు…