భారత్‌లో జమ్మూకశ్మీర్ మొత్తం అంతర్భాగం. దీనిపై పాకిస్థాన్ ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ఆ దేశ వాదనలు చెల్లడం లేదు. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా కూడా భారత్‌లో జమ్మూకశ్మీర్‌ను అంతర్భాగంగా చూపుతూ మ్యాప్ విడుదల చేసింది..అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన భారత చిత్ర పటంలో జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో భాగంగా స్పష్టంగా చూపించారు. పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో భాగంగానే గుర్తించారు. ప్రస్తుతం పీవోకే పాకిస్థాన్ నియంత్రణలో ఉన్న విషయం తెలిసిందే.
దీంతో జమ్మూకశ్మీర్‌పై అమెరికా వైఖరి స్పష్టమైంది. అమెరికా నాయకత్వం భారత రాజకీయ పటాన్ని అంగీకరిస్తోందని తేలిపోయింది. జమ్మూకశ్మీర్ మొత్తం భారత్‌లో భాగమేనన్న వాస్తవానికి అమెరికా మద్దతిచ్చినట్టయింది. ఎటువంటి ఆధారాలులేకుండా పాకిస్థాన్ చేస్తున్న వాదనలకు మద్దతు ఇవ్వడం లేదు అని సంకేతం ఇచ్చింది..
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించనుంది. అదే సమయంలో భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడానికి, అదనపు 25 శాతం సుంకాన్ని ఉపసంహరించుకోవడానికి వాషింగ్టన్ అంగీకరించింది. ఈ వాణిజ్య ఒప్పంద ప్రకటనలో భాగంగా విడుదల చేసిన మ్యాప్, రెండు దేశాల మధ్య పెరుగుతున్న విశ్వాసానికి, బలపడుతున్న సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోంది.