పాక్ గీత దాటితే యుద్ధమే..!.

పాక్ గీత దాటితే యుద్ధమే.!.

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. అవి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూలాలు. వాటిని భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ కూడా తమ భూభాగంలో దాడులు చేశారని ఆరోపించింది. అయితే ఆ దేశానికి యుద్ధానికి దిగేంత ధైర్యం ఉందా లేదా అన్నదే ఇక్కడ కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధానికి దిగితే రెండో రోజే ఆ దేశం దివాలా తీస్తుంది. ఉక్రెయిన్ కన్నా అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

తనపై దాడులు జరిగాయని అంతర్జాతీయ సమాజానికి చెప్పుకునే ప్రయత్నం ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తోంది. దాడుల విషయంలో అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేసే హక్కు భారత్ కు ఉందని.. ఈ విషయంలో భారత్ పై యుద్ధానికి దిగే సాహసం పాకిస్తాన్ చేయవద్దని అమెరికా సలహా ఇచ్చింది. పాకిస్తాన్ కు ఇప్పటి వరకూ నికరంగా మద్దతు పలికిన దేశం లేదు. చైనా తమ మద్దతు పాకిస్తాన్ కే అని చెప్పినా.. భారత్ ఉగ్రవాద క్యాంపులపై మాత్రమే దాడి చేసింది కాబట్టి.. ఈ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా ముందుకు వచ్చే అవకాశాలు లేవు.

చైనా పాకిస్తాన్ కు మద్దతివ్వగలదు కానీ.. భారత్ పై దాడికి సిద్ధమయ్యే అవకాశం లేదు. అదే జరిగితే చైనా కూడా అంత కంటే ఎక్కువ దెబ్బతింటుంది. అలాంటి రిస్క్ తీసుకోలేదు. ఉగ్రక్యాంపులపై దాడులు చేయడానికి ముందే… భారత్ ప్రపంచంలోని కీలక దేశాలకు సమాచారం ఇచ్చింది. ఉగ్ర క్యాంపులపై ఆధారాలు ఇచ్చింది. ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతు పలికితే.. అది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడమేనన్న సంకేతాలు పంపింది. దీంతో పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మద్దతు లభించడం కష్టం. యుద్ధానికి దిగితే.. పాకిస్తాన్ పైనే ప్రపంచదేశాలు ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి…

పాకిస్తాన్ లో జైష్ ఎ మహ్మద్ ను 2022లో నిషేధించారు. కానీ అది కాగితాల వరకే పరిమితమైంది. దీన్ని పాక్ ప్రభుత్వం కూడా చూసీ చూడనట్టు వదిలేసింది. దీంతో ఆ సంస్థ తన శిబిరాన్ని నిర్వహించడానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఇక బహవల్ పూర్ లో రహస్య అణు స్థావరం కూడా ఉందని చెబుతున్నారు. దీనికి దగ్గరలోనే జేఎం ఉండడం…ఆ సంస్థకు ఐఎస్ఐ మద్దతిస్తోందన్న దానికి అతి పెద్ద నిదర్శనమని అంటున్నారు. మదర్సాగా ముసుగు వేసుకున్న మసీదులో జైష్ ఎ మహ్మద్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ మసీదుకు జెఎం అనుబంధ సంస్థ అయిన అల్-రెహమత్ ట్రస్ట్ నిధులు సమకూరుస్తోంది. 2011 వరకు ఇది ఒక సాధారణ భవనం, కానీ 2012 నాటికి దీనిని ఒక పెద్ద శిక్షణా కేంద్రంగా మార్చారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, గుర్రాల శాల, జిమ్ లాంటివి కూడా ఉన్నాయి.

జైష్ ఎ మహ్మద్ చేసిన దాడులు..

ఏప్రిల్ 2000: శ్రీనగర్లోని బాదామి బాగ్లో మొదటి ఆత్మాహుతి దాడి, నలుగురు సైనికులు అమరులయ్యారు.

అక్టోబర్ 2001: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై దాడి, 30 మందికి పైగా మృతి.

డిసెంబర్ 2001: పార్లమెంటుపై దాడి, 14 మంది మరణం.

జనవరి 2016: పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి, ముగ్గురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు.

సెప్టెంబర్ 2016: ఉరి దాడి, 19 మంది భారత సైనికులు అమరులయ్యారు.

ఫిబ్రవరి 2019: పుల్వామా దాడి, 40 మంది CRPF సైనికులు అమరులయ్యారు.

2024-25: పహల్గామ్ దాడిలో జెఎం సహాయక విభాగం ప్రమేయం

మసూద్ అజార్ ఎవరు..

1968లో పుట్టిన మసూద్ అజార్ జైష్ ఎ మహ్మద్ వ్యవస్థాపకుడు. 2019లో ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించబడ్డాడు. 1994లో భారతదేశంలో అరెస్టయ్యాడు. అంతకు ముందు అతను ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-ముజాహిదీన్ సభ్యుడు, మతాధికారి. జైలు నుంచి విడుదల అయ్యాక మసూద్ అజార్ జైష్-ఎ-మొహమ్మద్ ను స్థాపించాడు. ఈ సంస్థ రాడికల్ ఇస్లామిక్ భావజాలాన్ని ప్రేరేపిస్తుంది. 2000 తర్వాత భారతదేశంలో జెఎం, మిగతా ఉగ్రవాద సంస్థలతో కలిసి అనేక దాడులు చేసింది. ఇందులో భారత్ లోని వాటిలో జమ్మూ కాశ్మీర్ శాసనసభ, భారత పార్లమెంటుపై దాడులు కూడా ఉన్నాయి. 1999 డిసెంబర్ 24న, ఐదుగురు హర్కత్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాదులు 190 మంది ప్రయాణికులు , సిబ్బందితో వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేశారు. ఖాట్మండు నుండి ఢిల్లీకి వెళుతున్న ఫ్లైట్ ను అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా కాందహార్ కి తీసుకెళ్లారు. భారతదేశం ముగ్గురు ఉగ్రవాదులను – మసూద్ అజార్, ఒమర్ షేక్, ముష్తాక్ జర్గర్ అనే ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేశాక విమానాన్ని రిలీజ్ చేశారు. మసూద్ అజార్ తర్వాత జేఎం లో అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. వీరి తర్వాత షా నవాజ్ ఖాన్ (సజ్జిద్ జిహాదీ), మౌలానా ముఫ్తీ మొహమ్మద్.. 300 మందికి పైగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ఇతర కీలక నాయకులుగా ఉన్నారు.