పాకిస్థాన్‌లో పేలుళ్లు.. పట్టాలు తప్పిన రైలు
మరోసారి రెచ్చిపోయిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని భీకర దాడులు
సింధ్-బలూచిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సుల్తాన్‌కోట్ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై ఐఈడీ బాంబులు అమర్చి పేలుళ్లు
అదే సమయంలో క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురవడంతో పట్టాలు తప్పిన ఆరు బోగీలు
ఈ ఘటనకు బాధ్యత వహించిన పాక్‌లోని వేర్పాటువాద బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ బలోచ్ మిలిటెంట్ల బృందం.
పేలుడు ధాటికి అనేక మంది సైనికులు మరణించినట్లు సమాచారం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వెట్టా వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు.. సుల్తాన్‌కోట్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో.. రైల్వే ట్రాక్‌పై ముందుగా అమర్చిన IED బాంబులు ఒక్కసారిగా పేలాయి. భారీ శబ్దంతో పరిసర ప్రాంతం దద్దరిల్లిపోయింది. పేలుడు ధాటికి రైలు వెనుక భాగంలోని బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రైలులో ఉన్న పలువురు ప్రయాణికులు, భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు..పేలుడు జరిగిన వెంటనే పాకిస్థాన్ రైల్వే సిబ్బంది, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బోగీల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు కృషి చేశారు. గాయపడిన వారిని సమీపంలోని సుక్కూర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అధికారుల సమాచారం ప్రకారం, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
దాడి బాధ్యత వహించిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ
దాడి జరిగిన గంటల్లోపే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. (BLA) ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థకు చెందిన బలోచ్ మిలిటెంట్లు గతంలో కూడా పలు రైల్వే, సైనిక స్థావరాలపై దాడులు జరిపారు. బలూచిస్థాన్ స్వతంత్రత కోసం సాయుధ పోరాటం చేస్తున్న ఈ సంస్థ పాకిస్థాన్ ప్రభుత్వంపై, సైనిక బలగాలపై నిరంతరం దాడులు కొనసాగిస్తోంది.