ఫైనల్లోకి పాకిస్థాన్‌, పోరాడి ఓడిన బంగ్లాదేశ్.

ఆసియాకప్‌లో (Asia Cup) పాకిస్థాన్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సూపర్‌-4 పోరులో పాక్‌ 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై (Bangladesh) ఉత్కంఠ విజయం సాధించింది. పాక్‌ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 124/9 స్కోరుకు పరిమితమైంది. షమీమ్‌ హుస్సేన్‌(30) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. ఆఫ్రిదీ(3/17), రవూఫ్‌(3/33)..బంగ్లా పతనంలో కీలకమయ్యారు. తొలుత పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 135/8 స్కోరు చేసింది. హరిస్‌(31), నవాజ్‌(25) రాణించారు. తస్కిన్‌ అహ్మద్‌(3/28) మూడు వికెట్లు తీయగా, మెహదీహసన్‌, రిశాద్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఆసియా టైటిల్‌ పోరు జరుగనుంది…

బంగ్లా పోరాడినా.

పాక్‌ నిర్దేశించిన లక్ష్యఛేదనలో బంగ్లాను మొదటి ఓవర్‌లోనే ఓపెనర్‌ పర్వేజ్‌ హుస్సేన్‌(0)ను ఔట్‌ చేయడం ద్వారా ఆఫ్రిదీ దెబ్బతీశాడు.సైఫ్‌ హసన్‌ ఒకింత తడబడటంతో బంగ్లాకు మెరుగైన శుభారంభం దక్కలేదు. ఆఫ్రిదీ తన మూడో ఓవర్‌లో తౌహిద్‌(5)ను ఔట్‌ చేయగా, సైఫ్‌(18)ను రవూఫ్‌ పెవిలియన్‌ పంపడంతో బంగ్లా కష్టాలు రెట్టింపయ్యాయి. వీరిని అనుసరిస్తూ మెహదీ (11), నురుల్‌ (16) వెంటనే వెంటనే ఔటయ్యారు. ఈ దశలో షమీమ్‌ హుస్సేన్‌(30) ఒంటరిపోరాటం చేశాడు. ఏడో వికెట్‌కు తంజిమ్‌తో కలిసి కీలకమైన 24 పరుగులు జోడించాడు. ఆఖరి ఓవర్‌లో 23 పరుగులు అవసరమైన దశలో రిషాద్‌(16 నాటౌట్‌) ఫోర్‌, సిక్స్‌తో ఆశలు రేపినా లాభం లేకపోయింది..

స్కోర్లు బోర్డు.

పాకిస్థాన్‌: 20 ఓవర్లలో 135/8(హరిస్‌ 31, నవాజ్‌ 25, తస్కిన్‌ 3/28, రిషాద్‌ 2/18),.

బంగ్లాదేశ్‌: 20 ఓవర్లలో 124/9(షమీమ్‌ 30, రిషాద్‌ 16 నాటౌట్‌, ఆఫ్రిదీ 3/17, రవూఫ్‌ 3/33)