పాక్ గగనతలంలో కొన్ని రోజులుగా కనిపిస్తున్న కొన్ని విమానాలు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నను గాల్లోనే వేలాడదీస్తున్నాయి. టర్కీకి చెందిన సైనిక రవాణా విమానాలు వరుసగా పాకిస్థాన్లోని కీలక వైమానిక స్థావరాల్లోకి వచ్చి వెళ్తున్నాయి..ఆగస్టు 19 నుంచి 21 మధ్య దాదాపు 60 గంటల వ్యవధిలో టర్కీకి చెందిన C130 హర్క్యులిస్, A400m విమానాల కదలికలు కనిపించాయి. నూర్ ఖాన్, మస్రూర్, మురీద్ లాంటి పాకిస్థాన్ సైనిక స్థావరాల్లో ఇవి దిగినట్టు ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ సమాచారాన్ని పరిశీలించిన సంస్థలు చెబుతున్నాయి. అయితే విమానాలు వచ్చాయన్నది కనిపిస్తున్న నిజమే కానీ వాటిలో ఏముంది అన్నది మాత్రం ఇప్పటికీ చీకటిలోనే ఉంది.
ఇంతకీ టర్కీ ఏదైనా కొత్త సైనిక సామగ్రిని ఇస్లామాబాద్కు పంపుతోందా? ఆ సామగ్రి డ్రోన్లా? ఎయిర్ డిఫెన్స్ పరికరాలా? లేదా సాధారణ సైనిక లాజిస్టిక్సా? ఇప్పటివరకు టర్కీ కానీ పాకిస్థాన్ కానీ ఈ విమానాల్లో ఏం తరలించారో అధికారికంగా చెప్పలేదు. అందుకే దీన్ని ఆయుధ సరఫరా అని ఇప్పటికైతే చెప్పలేం. అయితే ఈ కదలిక ఇప్పుడు ఎందుకు ఇంత ఆసక్తిని రేపుతోందంటే దాని వెనుక ఒక పెద్ద నేపథ్యం ఉంది.