చెరపకురా చెడెవు’ అన్నది నానుడి. ఇతరులను ఇబ్బంది పెడితే మనకూ ఇబ్బంది తప్పదన్నది దాని అర్థం. పాకిస్తాన్ పరిస్థితి ఇపుడు అలాగే ఉంది..భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమాయకుల ప్రాణాలను హరిస్తూ వస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు సొంత దేశాస్తుల ఆందోళనతో అట్టుడుగుతోంది. గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ అగ్నిగుండమవుతోంది. గతవారం రోజులుగా దేశంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడసికొట్టడంతో పాటు ఆందోళనకారులు పోలీసులపై తిరగబడటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దాంతో ఒక అధికారి సహా పలువురు ఆందోళన కారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో లాహోర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. గాజా యద్ధం ముగిసిందన్న సంతోషంతో పాలస్తీనా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. పాక్‌లో మాత్రం హింస చెలరేగడం గమనార్హం.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా టీఎల్పీ లాహోర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కొంతకాలంగా నిరసనలు చేపడుతోంది. ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రకటించిన తర్వాత ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీ ముట్టడించేందుకు యత్నించింది. అయితే ఆందోళన కారులను అడ్డుకునేందుకు పోలీసులు చేస్తోన్న ప్రయత్నాలు హింసాత్మకంగా మారుతున్నాయి. పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్ మాట్లాడుతూ.. పోలీసులపై ఆందోళనకారులు కాల్పులు జరిపారని ఆరోపించారు.దీంతో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు మరణించారన్నారు. మరోవైపు తమ మద్దతుదారులు అనేకమంది మరణించడం, లేదా గాయపడడం జరిగిందని టీఎల్పీ వెల్లడించింది.
పోలీసులు నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులకు ముందు ఆయన విడుదల చేసిన వీడియోలో ఫైరింగ్ చేయొద్దని పోలీసులకు విన్నవించినట్లు కనిపిస్తోంది. అధికారులతో చర్చలకు తాము సిద్ధమని అభ్యర్థించినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో తుపాకీ పేలుళ్ల శబ్దం కూడా వినిపించింది. మరొక వీడియోలో.. పలు వాహనాలు మంటల్లో దగ్ధమవుతున్న దృశ్యాలున్నాయి. ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపుగా వెళ్లకుండా రోడ్లపై షిప్పింగ్ కంటైనర్లను అడ్డుగా పెట్టినట్లు కనిపిస్తోంది. వాటిని తొలగించడంతో తాజాగా మరోమారు ఘర్షణలు చెలరేగాయి.
అయితే టీఎల్పీ ప్రదర్శనలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో యుద్ధం ముగుస్తోన్న సమయంలో టీఎల్పీ ఆందోళనలకు దిగడాన్నిపలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అక్కడ శాంతి నెలకొనడం వారికి ఇష్టం లేదేమో అని అభిప్రాయపడుతున్నారు. గాజాలో శాంతి ఒప్పందం నేపథ్యంలో వేడుకలు చేసుకోవాల్సిందిపోయి, హింసకు దిగడడం ఎందుకో అర్థం కావడం లేదని పాక్ మంత్రి తలాల్ చౌధరీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇక నిరసన ప్రారంభం కావడానికే ప్రభుత్వం అతిగా ప్రవర్తించిందని, ముందుగానే రోడ్లను దిగ్బందించిందని దానివల్లే హింస చెలరేగిందని మరికొందరు విమర్శిస్తున్నారు..
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో రెండవ స్థానంలో పాక్..
పాకిస్థాన్ ఇన్స్టి ట్యూట్ ఫర్ కాన్స్టిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (PICSS) ప్రకారం.. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన హింసాత్మక సంఘటనల సంఖ్య 2024 మొత్తం ఏడాదిలో జరిగిన వాటితో సమానం అని వెల్లడించాయి. కేవలం జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే పాక్‌లో 500 కంటే ఎక్కువ దాడులు జరిగాయని, వీటిలో వందలాది మరణాలు నమోదయ్యాయని నివేదికలు పేర్కొన్నాయి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో పాకిస్థాన్ రెండవ స్థానానికి చేరుకుంది. పాకిస్థాన్ ప్రస్తుతం ముక్కోణపు ఘర్షణలో చిక్కుకుందని, ఇది దాయాది భద్రతా విధానాన్ని కుదిపేయడమే కాకుండా, ఆ దేశ అంతర్గత రాజకీయ సమతుల్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు.
పాక్‌కు తాలిబన్లతో వైరం..
ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్థాన్ తన “వ్యూహాత్మక లోతు” సిద్ధాంతాన్ని బలోపేతం చేయాలని ఆశించింది. ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు దాయాది దేశం తాలిబన్ల రాకను కూడా స్వాగతించింది. ఆ సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అధికారాన్ని స్థాపించడానికి తమ దేశం సహాయం చేసిన ముజాహిదీన్ ఇప్పుడు అక్కడ అధికారంలో ఉందని పాక్ భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దును గుర్తించే డ్యూరాండ్ లైన్‌ను కూడా తాలిబన్లు గుర్తించడం లేదు. అమెరికాలో 2021లో పాకిస్థాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆశించినది సాధించిందని, కానీ తరువాత దానికి చింతిస్తుందని అన్నారు. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం వల్ల పాకిస్థాన్‌లో అంతర్గత హింస మరింత పెరుగుతుందని ఆయన అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమైనట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల రోజుల్లో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్‌కు ఒక ముల్లుగా మారిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
“ఆఫ్ఘనిస్థాన్‌తో యుద్ధం పాక్ ప్రజలకు ప్రయోజనం కలిగించదు. యుద్ధం ఎప్పటికీ ప్రయోజనం కాదు. ఆఫ్ఘన్లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడాన్ని ప్రోత్సహించడం తప్పు, ఇప్పుడు వారితో పూర్తిగా యుద్ధానికి వెళ్లడం పెద్ద తప్పు” అని హుస్సేన్ హక్కానీ చెబుతున్నారు. భద్రతా నిపుణుడు, దక్షిణాసియా రాజకీయ పరిశీలకుడు మైఖేల్ కుగెల్మాన్ మాట్లాడుతూ.. ఆఫ్ఘన్ -పాక్ సరిహద్దు సంక్షోభం, సంవత్సరాలలో అత్యంత దారుణమైనదిగా పేర్కొన్నారు. ఇది రెండు ప్రాథమిక సత్యాల ఫలితమని ఆయన చెప్పారు.
పాక్‌ను కలవరపాటుకు గురిచేసిన తాలిబన్లు..
పాకిస్థాన్.. ఆఫ్ఘన్ యుద్ధం ముగిసినప్పటి నుంచి తాలిబన్లపై ప్రభావాన్ని కోల్పోయింది. వాస్తవానికి తాలిబన్లకు కూడా ఇకపై పాక్ మద్దతు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వంపై తాలిబన్ల ఆరోపణ ఏమిటంటే.. పాక్ ఆఫ్ఘనిస్థాన్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. తాజాగా ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి, తాలిబన్ నాయకుడు అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశాన్ని సందర్శించారు. ఈ పరిణామం తాలిబన్ల విషయంలో పాకిస్థాన్‌ను మరింత కలవర పెట్టిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పాక్ – ఆఫ్ఘన్ సైన్యాల మధ్య రక్తపాత ఘర్షణ చెలరేగింది. అక్టోబర్ 9న ప్రారంభమైన ఈ ఘర్షణలో పాక్ వైమానిక దళం కాబూల్‌పై వైమానిక దాడులు ప్రారంభించిందని, దీనితో తాలిబన్లు డ్యూరాండ్ లైన్‌పై కాల్పులు జరిపారని నివేదికలు పేర్కొన్నాయి. అక్టోబర్ 11, 12 తేదీలలో అంగూర్ అడ్డా, బజౌర్, కుర్రం, దిర్, చిత్రాల్ (ఖైబర్ పుంఖ్వా), బారంచా ( బలూచిస్థాన్ )లలో భారీ ఘర్షణలు చెలరేగాయి. ఈ దాడిలో సుమారు 200 మంది తాలిబన్లు మరణించారని పాక్ చెబుతుండగా, 58 మంది పాకిస్థాన్ సైనికులను చంపినట్లు తాలిబన్లు చెబుతున్నారు. కానీ పాక్ సైన్యం చనిపోయిన వారి సైనికుల సంఖ్యను 23గా చెబుతోంది.
పాక్‌ను ముల్లులా పొడుస్తున్న బలూచ్ తిరుగుబాటుదారులు..
నైరుతి పాకిస్థాన్‌లో దాయాది ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు బలూచ్ తిరుగుబాటుదారులు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి గ్రూపులు బలూచిస్థాన్ విలువైన ఖనిజ వనరులను దుర్వినియోగం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బలూచిస్థాన్‌లోని అరుదైన మట్టి పదార్థాలను అమెరికాకు విక్రయించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం తాజాగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బలూచ్ తిరుగుబాటుదారులు తరచుగా పాకిస్తాన్ సైన్యంపై దాడి చేస్తున్నారు. ఫిబ్రవరి 2025లో గ్వాదర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో నలుగురు చైనా ఇంజినీర్లు మరణించారు. ఇది CPEC (చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్) పై జరిగిన ప్రత్యక్ష దాడి. సెప్టెంబర్ 2025లో క్వెట్టాలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 10 మంది మరణించారు. మార్చి 2025లో BLA జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసింది.
ఇటీవల ఆపరేషన్ సింధూర్‌లో భారతదేశం తొమ్మిది జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా (LeT) లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వైమానిక, డ్రోన్, సైబర్ యుద్ధంలో భారతదేశం పదికి పైగా పాకిస్థానీ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అలాగే అనేక పాకిస్థానీ విమానాలను కూల్చివేసింది. ఇదే సమయంలో భారతదేశం-పాక్‌తో సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసి, సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టింది. ఇకపై ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని, దానికి తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని పాక్‌కు భారత్ స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ మూగిసిన వెంటనే ఈ రెండు యుద్ధాలు పాక్ నెత్తిన పిడులా పడ్డాయి. ప్రస్తుతం పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..