కులం పేరు ప్రస్తావించడం ఇదే మొదటిసారి. నేను తప్పు చేస్తే క్షమించండి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది..ఈ ఈవెంట్ లో జరిగిన ఒక చిన్న పొరపాటుపై చిత్రంలో విలన్ పాత్ర పోషించిన ప్రముఖ నటుడు, దర్శకుడు పార్తిబన్ స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆ వేడుకలో తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో కులం పేరును ప్రస్తావించడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. దీనిపై పార్తిబన్(Parthiban) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరణ ఇచ్చారు.

‘నేను కుల వ్యవస్థకు వ్యతిరేకంగా చాలా సినిమాలు చేశాను. అలాంటి నేను ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడాలని ఎందుకు అనుకుంటాను? ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఇలా కులం పేరు ప్రస్తావించడం ఇదే మొదటిసారి. నేను తప్పు చేస్తే వెంటనే సరిదిద్దుకునే వ్యక్తిని, అందుకే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను’ అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని హామీ ఇచ్చారు. పార్తిబన్ వివరణతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.

మరోవైపు, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్, తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రేపు విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.