కళ్లకు గంతలు కట్టి పెన్ను క్యాప్ మింగించిన తోటి విద్యార్థినులు
గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ర్యాగింగ్ కలకలం
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం దరిగాం రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఉషాన్ శృతి అనే విద్యార్థినిపై ర్యాగింగ్‌కు పాల్పడిన తోటి విద్యార్థినులు
కళ్లకు గంతలు కట్టి, కాళ్లు చేతులు బిగిసిపట్టి, నోట్లో పెన్ క్యాప్ వేసి నీళ్లు పోసి బలవంతంగా మింగించిన విద్యార్థినులు
బాలికను ఆసుపత్రికి తరలించగా, స్కానింగ్ చేసి కడుపులో పెన్ క్యాప్ ఉన్నట్టు గుర్తించి చికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు
కాగా ర్యాగింగ్ ఉదంతంపై కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు తండ్రి
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన గురుకుల పాఠశాల వేదికగా ఒక ఘోరమైన సంఘటన వెలుగుచూసింది. కాగజ్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే (MJP) వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాలలో తోటి విద్యార్థినుల మధ్య జరిగిన ఒక వికృత చేష్ట తీవ్ర కలకలం రేపింది. ర్యాగింగ్ లేదా సరదా అనే పేరుతో కొందరు బాలికలు చేసిన పని, చివరకు ఒక విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన ప్రభుత్వ వసతి గృహంలో ఇలాంటి సంఘటన జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది….
“అసలేం జరిగింది? ఆ రాత్రి ఏం చేశారు?
బాధిత కుటుంబం, పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శృతి అనే విద్యార్థినిపై తోటి బాలికలు క్రూరత్వానికి తెగబడ్డారు. హాస్టల్ గదిలో శృతిని ఒంటరిని చేసి, ఆమె కాళ్లు చేతులు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా, ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు కళ్లకు గంతలు కట్టారు. ఆపై నోరు తెరిపించి ఒక పెన్ క్యాప్‌ను లోపల వేసి, బలవంతంగా నీళ్లు పోసి మింగించారు. ఆ సమయంలో శృతి ఊపిరాడక, నరకయాతన అనుభవించినట్లు తెలుస్తోంది.”