ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి నా కృతజ్ఞతలు.. ప్రధాని మోడీ…

ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి నా కృతజ్ఞతలు. నా అభిమానాన్ని చూపించడానికి అవకాశం ఇప్పుడు లభించింది. ముందుగా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహా స్వామి వారికి నమస్కరిస్తున్నాను. వైజాగ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ తెలుగులో అన్న మాటలివి. తెలుగు పదాలను ఉచ్చరించడానికి మోడీ కొంత ఇబ్బంది పడినప్పటికీ ఆయనే స్వయంగా ఆ మాటలను గుర్తుంచుకుని తెలుగులో చెప్పిన తీరు ప్రత్యేకంగా అనిపించింది. తెలుగులో మాట్లాడి తెలుగు వారిని ఆకట్టుకునేందుకు ఇది ప్రధాని మోడీ చేసిన ప్రయత్నం. ఇక మిగతా స్పీచ్ మొత్తాన్ని కేంద్ర మంత్రి కింజారపు రామ్ మోహన్ నాయుడు తెలుగులో అనువదించారు…

అండగా ఉంటాం..

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు లక్ష్యాలకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని అన్నారు. ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామని మోదీ పేర్కొన్నారు. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని వెల్లడించారు. దీంతోపాటు ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

2030 నాటికి..

ఈ ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. 2030లోగా 5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడమే మా లక్ష్యమని ప్రధాని తెలిపారు. నవయుగ పట్టణీకరణకు ఏపీ సాక్ష్యంగా మారబోతోందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ చాలా కాలంగా ఉందని, చిరకాల కోరిక ఈరోజు నెరవేరిందన్నారు. రైల్వే జోన్ రాకతో వ్యవసాయంతోపాటు అనేక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఏపీ అభివృద్ధి మా విజన్ అని మరోసారి గుర్తు చేశారు ప్రధాని మోదీ.

చిరకాల వాంఛ నెరవేరుతుంది: ప్రధాని

‘దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్‌ హబ్‌లు వస్తుంటే.. అందులో ఒకటి విశాఖకు కేటాయించాం. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ద్వారా ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేశాం. 3 రాష్ట్రాల్లోనే ఇలాంటి బల్క్‌ డ్రగ్‌ పార్కులు వస్తున్నాయి. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో క్రిస్‌ సిటీ భాగం అవుతుంది. ఇప్పటికే శ్రీసిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ఊపందుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశాం. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్‌ కీలకం కానుంది. రైల్వే జోన్‌ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. రైల్వే జోన్‌ వల్ల వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయి.’ అని ప్రధాని మోదీ అన్నారు…