గాంధీ డోక్లామ్ అంశాన్ని ప్రస్తావించడంతో గందరగోళం…

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డోక్లామ్ అంశాన్ని ప్రస్తావించడంతో గందరగోళం నెలకుంది. ఆర్మీ మాజీ చీఫ్ ముకుంద్ నరవాణే రాసిన పుస్తకంలోని ఓ వ్యాక్యాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించడంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ చెప్పిన పుస్తకం ఎక్కడుంది అని స్పీకర్ ప్రశ్నించారు. రూల్స్ అతిక్రమించవద్దని, పుస్తకం ప్రామాణికత చెప్పాలని పేర్కొన్నారు. సభలో పేపర్ కటింగ్స్, ప్లకార్డులు, ఫ్లేక్సీలు ప్రదర్శించడం నిషేధమని స్పీకర్ వ్యాఖ్యానించారు. సబ్జెక్ట్ మాట్లాడాలంటూ రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు తమ సీట్ల నుంచి లేచి నిరసన తెలిపారు…కేంద్రం నుంచి ఏదో ఒక సమాధానం వస్తుందనే తాను ఈ అంశాన్ని ప్రస్తావించనని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా పుస్తకం ప్రామాణికత ఏంటో చెప్పాలని స్పీకర్ ప్రశ్నించగా.. ఆ పుస్తకాన్ని విడుదల చేయకుండా అడ్డుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో స్పీకర్, రాహుల్ గాంధీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
రాహుల్ గాంధీ మాత్రం ‘వారిని అంతగా భయపెడుతున్నది అందులో ఏముంది? ఒకవేళ భయపడకపోతే, నన్ను చదవడానికి అనుమతించాలి’ అన్నారు.

మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకం: మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె రాసినట్లుగా భావిస్తున్న ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ (Four Stars of Destiny) అనే అముద్రిత (Unpublished) పుస్తకంలోని అంశాలను రాహుల్ గాంధీ సభలో చదివి వినిపించారు.
చైనా చొరబాటు ఆరోపణలు: 2017 డోక్లామ్ ప్రతిష్టంభన సమయంలో చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి ప్రవేశించాయని ఆ పుస్తకంలో పేర్కొన్నట్లు రాహుల్ ఆరోపించారు. “ఎవరు దేశభక్తులో, ఎవరు కాదో దీని ద్వారా అర్థమవుతుంది” అంటూ విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ అభ్యంతరం: అముద్రిత పుస్తకాలను లేదా ధృవీకరించని పత్రికా కథనాలను సభలో ఉటంకించడం నిబంధనలకు విరుద్ధమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని, రాహుల్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు మండిపడ్డారు.
స్పీకర్ నిర్ణయం: సభా నిబంధనల ప్రకారం అముద్రిత సమాచారాన్ని రికార్డుల్లోకి తీసుకోలేమని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేస్తూ, రాహుల్ గాంధీని ఆ అంశంపై మాట్లాడకుండా నిరోధించారు.