గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌కు రూ.కోటి నజరానా…!

ఆస్కార్ అవార్డు పొందిన పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)కు తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి నజరానా ప్రకటించింది. సొంత కృషితో ఎదిగిన రాహుల్….తెలంగాణ యువతకు రోల్ మోడల్‌గా నిలిచాడని సీఎం రేవంత్ రెడ్డి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడిన “నాటు నాటు” పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. మార్చి 2023 లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల వేడుకలో వీరు ఈ పాటను ప్రదర్శించారు. ఆ వేడుకలో ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డ్స్ (TGFA) తెలుగు సినిమాలోని ప్రతిభను, అలాగే భారతీయ సినిమాలో జీవితకాల విజయాలను గుర్తించేందుకు అవార్డులను అందించింది. అయితే ఈ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రత్యేకంగా ప్రకటించారు. ఆయన గద్దర్ అవార్డుల వేదిక మీదనే.. హైదరాబాద్ లోకల్ కుర్రాడు అయిన రాహుల్ సిప్లిగంజ్ కు ప్రత్యేక అవార్డు ఏదైనా ఉంటే ప్రకటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సింగ్ రాహుల్ కు బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.