మేఘాలకు చిల్లు పడిందా అన్నట్లు రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంత కుంభవృష్టి పడుతోంది. గురువారం కూడా అతిభారీగా, శుక్రవారం భారీగా వానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. శనివారం నాటికి కొంతమేర తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేసింది వాతావరణ శాఖ..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలానికి అయిదు రోజులుగా బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం నుంచి రాంనగర్ వెళ్లే రోడ్డు మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట, వాజేడు, వెంకటాపురం తదితర మండలాల్లో గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మొక్కజొన్న పొలాల్లో నుంచి వరద నీరు వేగంగా బయటికి వెళ్లేలా రైతులు చర్యలు తీసుకోవాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది.
కాళేశ్వర గ్రామం సమీపంలోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మహాముత్తారం మండలంలోని యత్నారం గ్రామం జలదిగ్బంధంలో ఉంది. ఏటూరునాగారం మండలం రొయ్యూరులో బుధవారం మేతకు వెళ్లిన గేదెలను గోదావరి వరద చుట్టుముట్టడంతో వాటిలో కొన్ని కొట్టుకుపోయాయి. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ జిల్లాల్లో 50 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 20 కిలోమీటర్ల తారురోడ్డు వరదకు లేచిపోయింది. 20 కల్వర్టులు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 35 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.* నిజామాబాద్ జిల్లాలో 27,802 ఎకరాల పంటలు పూర్తిగా వరదనీటలో మునిగిపోయాయి. మొత్తం 8 ఇళ్లు పూర్తిగా, మరో 131 పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాదాపు 20 ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం, పలిమెల, మహా ముత్తారం మహాదేవపూర్ మల్హర్ మండలాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల్లోని 1500 మందిని తరలించారు. ఈ జిల్లాలో 70 పశువులు మృతి చెందాయి. 35 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 55 విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. మొత్తం 13,280 ఎకరాల పత్తి, 1500 ఎకరాలకు సరిపడే వరి నారుమళ్లు మునిగిపోయాయి. 600 ఇళ్ల గోడలు, 35 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. పెద్దంపేట వాగు వంతెన సమీపంలో రోడ్డు తెగిపోయి పలిమెల మండలానికి రాకపోకలు నిలిచిపోయి అయిదు రోజులవుతోంది…