తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది…రాబోయే రెండుగంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి సహా 15 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. జిల్లాల్లో రెండుగంటల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని.. 15 జిల్లాల్లో రెండు నుంచి మూడుగంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, నల్గొండ, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి, సూర్యాపేట, హన్మకొండ, నాగర్ కర్నూల్ వర్షాలుంటాయని హెచ్చరించింది…
హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరుణాగ్రహానికి రోడ్లు, లోతట్టు కాలనీలు చెరువులు, నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి భారీగా వరద చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నగర పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి మూసీ నదికి వరద పోటెత్తింది. హైదరాబాద్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. ఇప్పటి వరకు అత్యధికంగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో 93.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
కుండపోత వర్షం : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా జోరు వాన పడుతుంది. బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, పారడైజ్, బేగంపేట్, మారేడుపల్లి ప్రాంతాల్లోని ప్రధాన రహదారులతో పాటు కాలనీలకు వరద భారీగా చేరింది. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, సైఫాబాద్, ఖైరతాబాద్ పరిసరాల్లోనూ ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది…
భారీ వర్షానికి ట్రాఫిక్ : ఫ్లై ఓవర్ల కింద, బస్టాప్‌ల వద్ద ద్విచక్రవాహనదారులు తలదాచుకున్నారు. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, లంగర్‌హౌస్, గుడిమల్కాపూర్, గోల్కొండ, జియాగూడ, మెహదీపట్నం, ఆసిఫ్‌నగర్‌లో కురుస్తున్న భారీ వర్షానికి ట్రాఫిక్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
అంబర్‌పేట, కాచిగూడ, బర్కత్‌పురా, సైదాబాద్, చంపాపేట్, సరూర్‌నగర్ రోడ్లపైకి భారీ వరదచేరింది. వర్షానికి ఎల్బీనగర్ వద్ద ట్రాఫిక్ ఏర్పడి విజయవాడకు వెళ్లే పలు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఉప్పల్, నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో జోరు వర్షం కురిసింది. వర్షం కారణంగా తుక్కుగుడా ఓఆర్ఆర్ వద్ద వరద నీరు నిలిచిపోయింది. భారీవర్షాలను దృష్టిలో ఉంచుకొని ఇవాళ, రేపు ఒక్కపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని పోలీసులు ఆయా సంస్థలకు సూచించారు..