రైతు భరోసా చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తోంది. ఈ నెల 16న రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష, మంత్రిమండలి సమావేశాల్లో రైతు భరోసా సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఆర్థిక శాఖ అంచనాలను రూపొందించి సీఎంకు నివేదించగా, నిధుల విడుదలకు ఆయన ఆమోదించినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది. ఈ నెల 16న మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అదే రోజు సీఎం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి రైతు నేస్తం కార్యక్రమం కింద వివిధ జిల్లాల రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రతి మంగళవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రైతు నేస్తం కింద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు.
ఈ రైతు నేస్తం కార్యక్రమంలో అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు, సూచనలు అందించి సందేహాలను నివృత్తి చేయనున్నారు. సీఎం పాల్గొనే ముఖాముఖి కార్యక్రమం 16న మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 1500 రైతు వేదికల్లో ఇది ప్రత్యక్ష ప్రసారం కానుంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన ఆదేశించారు….బాండ్ల విక్రయం మొత్తం ఖజానాకు : బాండ్ల విక్రయం ద్వారా ఈ మంగళవారం రూ.3000 కోట్లు ఖజానాకు జమ అయ్యాయి. తాజాగా మరో రూ.4000 కోట్ల విలువైన బాండ్లను కూడా జారీ చేశారు. వచ్చే మంగళవారం బాండ్ల వేలం తర్వాత ఆ మొత్తం కూడా ఖజానాకు చేరుతుంది. ఆ మొత్తాలతో రైతు భరోసాకు నిధుల సర్దుబాటు చేయనున్నారు.