*🔹రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు*
_• రాజీవ్ యువ వికాసం’ పథకం గడువును APR 14 వరకు ప్రభుత్వం పొడిగించింది._
_• ఇది వరకు షెడ్యూల్ ప్రకారం APR 4 వరకే ఉండగా, పలువురి విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు సమాచారం._
_• ఈ పథకంలో భాగంగా 5 లక్షల మందికి రూ.6వేల కోట్ల రుణాలను 60-80% వరకు రాయితీతో ఇవ్వనుంది._
_• అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు/ఇన్కం సర్టిఫికెట్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, ఫొటో అవసరం..
నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఒక కుటుంబానికి ఒకటే యూనిట్కు అవకాశమివ్వనున్నట్లు వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపింది. వ్యవసాయ సంబంధిత ఉపాధి కోసం 60 ఏళ్లు, ఇతర ఉపాధికి 55 ఏళ్లను గరిష్ఠ వయోపరిమితిగా నిర్ణయించింది. ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం ఉండగా దరఖాస్తు ప్రతిని ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని ప్రభుత్వం పేర్కొంది..నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా పథకం అమలు కానుంది. ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికన జిల్లాలు, మున్సిపాలిటీలు, మండలాలకు యూనిట్లు కేటాయిస్తారు. రూ.50 వేల వరకు ఖర్చయ్యే యూనిట్లకు ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇస్తుంది. రూ.50వేల నుంచి రూ.లక్ష వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు 90 శాతం సబ్సిడీ 10 శాతం బ్యాంకు రుణం ఉంటుంది.
వారికి లక్షవరకు పూర్తి రాయితీ :రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రూ.4 లక్షల వరకు ఉన్న యూనిట్లకు 70 శాతం రాయితీ ఇవ్వనుండగా మిగతాది బ్యాంకు రుణంగా అందించనుంది. మైనర్ ఇరిగేషన్కు సంబంధించిన యూనిట్లకు సైతం 100 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. బలహీన సముదాయాల వారికి చెందిన ప్రాజెక్టులకు రూ.లక్ష వరకు పూర్తి రాయితీ ప్రభుత్వం అందించనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారు రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులు. వ్యవసాయ అనుబంధ యూనిట్లకు 21 నుంచి 60 ఏళ్లు మిగతా యూనిట్లకు 21 నుంచి 55 ఏళ్ల వరకున్న వారిని అర్హులుగా ఖరారు చేశారు. ఆధార్ కార్డు, తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటో ఉండాలి. రేషన్ కార్డు లేని వారు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. రవాణా సంబంధిత యూనిట్లకు డ్రైవింగ్ లైసెన్సు, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఐదేళ్ల వరకూ ఒక కుటుంబానికి ఒకటే యూనిట్ కేటాయించనున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది..