కోహెడలో కేటాయించిన 200 ఎకరాల భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను.. హరీష్ రావు..

రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కోహెడలో కేటాయించిన 200 ఎకరాల భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని, ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్‌లో రూ.3,000 కోట్లు ఉన్నదని, దాన్ని ఎలాగైనా కాజేసేందుకు ముఖ్యమంత్రి, ఆయన ఆనుయాయులు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ రంగారెడ్డి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కోహెడలో నిర్వహించిన పండ్ల మార్కెట్‌ పరిరక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళారుల దందాకోసం కోహెడ పండ్ల మార్కెట్‌ భూములను అమ్మేసేందుకు సీఎం సిద్ధమయ్యారని చెప్పారు. రైతుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోహెడ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పండ్ల మార్కెట్‌, పూలు, చేపల మార్కెట్‌ ఏర్పాటుకు 200 ఎకరాలు కేటాయించిందని గుర్తుచేశారు… భూమిని టీజీఐఐసీకి బదలాయించి కోర్టు వివాదంలో ఉన్న దిల్‌ భూములను మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కమీషన్ల కోసం ముఖ్యమంత్రి వేలాది మంది రైతుల భూమిని టీజీఐఐసీకి అప్పగించి తద్వారా ఆయన అనుయాయులకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వెంటనే కోహెడలో పండ్ల మార్కెట్‌ పనులు ప్రారంభించకపోతే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. లక్షలాది మంది రైతుల కోసం ముఖ్యమంత్రి ఆలోచించకుండా నలుగురైదుగురు దళారుల కోసం తాపత్రయ పడుతున్నారని విమర్శించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌తో గతంలో ఎదురైన ట్రాఫిక్‌, పొల్యూషన్‌ వంటి సమస్యల నుంచి పరిష్కారం కోసం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కోహెడలో 200 ఎకరాల్లో మార్కెట్‌ నిర్మించాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

తానుకూడా మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా ఉన్నందున మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనతో కొట్లాడి రూ.10 కోట్లు పండ్ల మార్కెట్‌ కోసం తీసుకొచ్చారని గుర్తుచేశారు. భూసేకరణ సమయంలో రైతులకు రూ.17 కోట్ల పరిహారం ఇచ్చామని తెలిపారు. మార్కెట్‌ నిర్మాణం కోసం రూ.350 కోట్లను బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కేటాయించిందని, 2020లో జీవో 11 ద్వారా ఈ మార్కెట్‌ను నోటిఫై కూడా చేశామని, జీవో 2016 ప్రకారం రూ.350 కోట్లు బ్యాంకులో జమ చేశామని చెప్పారు. ఈ స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాశ్వత పండ్ల మార్కెట్‌, కోల్డ్‌ స్టోరేజీ, పూలు, చేపల మార్కెట్‌ నిర్మాణానికి రూ.వెయ్యికోట్ల అంచనాలతో డీపీఆర్‌ తయారు చేశామని తెలిపారు. నిధులు, భూమి ఉన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్కెట్‌ నిర్మాణాన్ని పక్కనబెట్టి ఈ భూమిని అమ్మాలని చూస్తున్నదని తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు..