అడుగంటిన సాగర్‌, శ్రీశైలం జలాశయాలు…!?

నాగార్జునసాగర్‌, శ్రీశైలం డ్యామ్‌లపై ఆధారపడినవారు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోనున్నారు. రెండింటిలో కలిపి ప్రస్తుతం నికరంగా 15 టీఎంసీల నీరే అందుబాటులో ఉండగా, అవసరాలు మాత్రం దాదాపు 25 టీఎంసీలకుపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న జలాల పంపిణీ కోసం సోమవారం త్రీమెంబర్‌ కమిటీ సమావేశం నిర్వహించాలని కేఆర్‌ఎంబీ నిర్ణయించింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు లేఖ రాసింది..తెలంగాణకు తీరని కష్టం..
రిజర్వాయర్లు అడుగంటడంతో తెలంగాణకు తాగునీటికి తండ్లాట తప్పని దుస్థితి నెలకొన్నది. శ్రీశైలం నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌పాటు ఏడు జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంది. సాగర్‌పై హైదరాబాద్‌తోపాటు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. మే, జూన్‌ నెలల్లో నికరంగా రెండు ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు తాగునీటి కోసం దాదాపు 12-15 టీఎంసీలు అవసరం. కానీ ప్రస్తుతం ఆ మేరకు జలాలు అందుబాటులో లేవు.

ఉన్నది 15 టీఎంసీలే..
నాగార్జునసాగర్‌ డెడ్‌స్టోరేజీ 510 అడుగులు కాగా ఆ లెవల్‌లో 131 టీఎంసీలు రిజర్వాయర్‌లో ఉంటాయి. ప్రస్తుతం సాగర్‌ మట్టం 514 అడుగులకు చేరుకోగా 138 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అంటే 7 టీఎంసీల జలాలే వినియోగించుకునే అవకాశముంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ 834 ఫీట్లు కాగా, ఆ స్థాయిలో 57 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం ఇప్పటికే డెడ్‌స్టోరేజీ దిగువకు వెళ్లిపోయింది. ప్రస్తుతం రిజర్వాయర్‌ లెవల్‌ 814 ఫీట్లకు చేరుకోగా, డ్యామ్‌లో 37 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 800 ఫీట్ల నుంచి కూడా జలాలను వినియోగించుకునే వెసులుబాటు ఇరు రాష్ర్టాలకు ఉంది. ఆ స్థాయికి వెళ్లినా అప్పటికి డ్యామ్‌లో 29 టీఎంసీలు ఉంటాయి. అందులో నికరంగా వినియోగానికి అందుబాటులో ఉండే జలాలు 8 టీఎంసీలే. వెరసి రెండు రిజర్వాయర్లలో కలిపి ఇప్పటికి అందుబాటులో ఉన్నది 15 టీఎంసీలు మాత్రమే. ఆవిరి నష్టాలు, రవాణా నష్టాలు పోగా నికరంగా 12 టీఎంసీలకు మించి అందుబాటులో ఉండకపోవచ్చని అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు మే, జూన్‌ నెలల్లో తాగునీటి కోసం ఇరు రాష్ర్టాలకు కలిపి దాదాపు 22 టీఎంసీల మేరకు అవసరమవుతాయి. అంటే దాదాపు 10 టీఎంసీల జలాలు కొరత ఏర్పడనున్నట్టు తెలుస్తున్నది.