రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. నామినేషన్ దాఖలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. పలుచోట్ల రిజర్వేషన్లపై రగడ నడుస్తోంది. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం గ్రామంలో కేవలం ఆరుగురు ఎస్టీ జనాభా ఉంటే వారికి సర్పంచి పోస్టుతో పాటు 3 వార్డులను కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. 2025 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా, 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం సరికాదని తెలిపింది.
ఈ విషయంపై సమర్పించిన వినతిపత్రాలపై నిర్ణయం తీసుకునేదాకా మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. మహమూద్‌పట్నం సర్పంచి పోస్టును ఎస్టీ మహిళకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ మిట్టగడుపుల యాకూబ్ హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది రమేశ్ చిల్లా వాదనలు వినిపిస్తూ గ్రామంలో 2025 ఓటర్ల జాబితా ప్రకారం 576 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అందులో ఎస్టీలు ఆరుగురేనని హైకోర్టుకు వివరించారు. వీరికి సర్పంచి పోస్టుతో పాటు 3 వార్డులను రిజర్వు చేశారని పేర్కొన్నారు. 250 మంది ఎస్సీలు, 300 మంది బీసీలు, 20 మందికి పైగా ఓసీలు ఉన్నారని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్లో ఎస్సీ జనరల్ మహిళకు కేటాయించిన అధికారులు, ఇప్పుడు ఎస్టీలకు కేటాయించారని కోర్టుకు వివరించారు.
అప్పటి వరకూ ఎన్నిక లేదు.
దీనిపై ఇచ్చిన వినతిపత్రాలపై చర్యలు తీసుకోలేదని ధర్మాసనం ముందు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో వినతి పత్రాలపై చర్యలు తీసుకునేదాకా మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు విచారణను డిసెంబరు 29కి వాయిదా వేశారు. వీటితో పాటు రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పలు పిటిషన్లపై విచారించిన న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
బీసీలకు 23 శాతం కూడా రిజర్వేషన్లు లేవు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వివాదం ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో పెండింగ్‌లో ఉన్నందున ఉత్తర్వులు ఇవ్వడం లేదన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ బీసీలకు 23 శాతం కూడా కేటాయించలేదని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన అనంతరం బీసీలకు రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు..
తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ : పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో నిర్వహించనున్నారు. డిసెంబరు 11, 14, 17వ తేదీల్లో నిర్వహించేందుకు తెలంగాణ ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచి ఎన్నికను సైతం నిర్వహించనున్నారు..