మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే.. కెటిఆర్..

సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా అనుముల బ్రదర్స్ పై కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరాచకాలు తట్టుకోలేక సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఇది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్య ఇది. ఆరు నెలల క్రితం ఒక యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారనే కక్షతో.. 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇంటి ముందు పశువుల దవాఖానాను కట్టడమే కాకుండా.. సీఎం ఆదేశాలతో ఇంటికి దారి కూడా లేకుండా అడ్డంగా గోడ కట్టేందుకు పూనుకోవడంతోనే తీవ్ర మనస్థాపానికి గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

రెండుసార్లు కొండారెడ్డిపల్లికి సర్పంచ్‌గా ఎన్నో సేవలందించిన వ్యక్తిని గౌరవించాల్సింది పోయి, 85 ఏళ్ల వయస్సున్న పెద్దాయన అని కూడా చూడకుండా గత కొన్ని నెలలుగా వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేకే చివరికి పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి బ్రదర్స్ తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టంచేసిన నేపథ్యంలో.. దీనికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇటీవల సొంత నియోజకవర్గం కొడంగల్‌లో గిరిజన ఆడబిడ్డలపై దమనకాండను దేశం మరిచిపోకముందే.. సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తుంటే.. రాష్ట్రంలో సీఎం, ఆయన సోదరుల ఆరచకాలకు అంతేలేకుండా పోయిందని స్పష్టమవుతోంది. ఇది ప్రజాపాలన కాదు.. అరాచక పాలన, నియంత పాలన, దుర్మార్గపు పాలన అని కేటీఆర్ మండిపడ్డారు.

అవసరం అయితే మళ్ళీ కోర్ట్ కు వెళ్తాం…!

అనర్హత పిటిషన్ల విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ తీర్పుపై ఆయన స్పందించారు. మొన్నటి వరకు స్పీకర్‌ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వాదించారని కేటీఆర్ గుర్తు చేశారు.

రీజనబుల్ పీరియడ్‌లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారని, రీజనబుల్ పీరియడ్ అంటే మూడు నెలలు అని మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మరోవైపు, గురుకులాల్లో పురుగుల అన్నం అంటూ రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. నీలి మేఘాల్లో సీఎం రేవంత్ .. నీలి నీడల్లో గురుకులాల భవిష్యత్తు. పట్టెడు అన్నం కోసం విద్యార్థుల పోరాటం-మూసీ ముడుపుల కోసం రేవంత్ ఆరాటం. కంచం లో పురుగులు,కాటేసే పాములు,కారణం లేని మరణాలతో విద్యార్థుల పోరాటం.. అదానితో దోస్తీ, అల్లుడి ఆస్తుల కోసం రేవంత్ ఆరాటం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కనీస వసతులు లేక, సరిపడా మరుగుదొడ్లు లేక, అనారోగ్యాలతో విద్యార్థుల పోరాటం – లగచర్ల పై లాఠీ విరిచి , రైతుల నడ్డి విరిచి ఫార్మా పేరుతో భూదందాకై రేవంత్ ఆరాటం. పురుగుల అన్నం తిని అంబులెన్స్‌లో విద్యార్థులు-పంచభక్ష పరమాన్నాలు తిని హెలికాఫ్టర్ లో రేవంత్, మంత్రుల షికార్లు. మూసీలో లక్షల కోట్లు కుమ్మరిస్తున్న ముఖ్యమంత్రి-విద్యార్థి కడుపుకు నాణ్యమైన బుక్కెడు బువ్వ కోసం ఖర్చుపెట్టవా? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.

ఇది ఇలావుంటే, తెలంగాణలో కేసీఆర్ వల్లే తెలంగాణలో బ్లూ రెవల్యూషన్ వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దాచేస్తే దాగని సత్యం – చెరిపేస్తే చరగని చరిత్ర: కేసీఆర్ తెలంగాణ లో సాధించిన

“నీలి విప్లవం” (Blue revolution). 2016-17 లో 1.93 లక్షల టన్నుల చేపల పెంపకం నుండి 2023-24 గు కు 4.39 లక్షల టన్నులు ఎగబాకిన వైనం. తెలంగాణ చేపల పెంపకం లో ఉత్తమ “ఇన్ ల్యాండ్ స్టేట్” గా అవార్డు కైవసం చేసుకోవడం కేసిఆర్ విజయం.