చెన్నైలో నేడు 31వ దక్షిణ రాష్ట్రాల సీఎంల సమావేశం….!

చెన్నైలో నేడు 31వ దక్షిణ రాష్ట్రాల సీఎంల సమావేశం.. డీలిమిటేషన్‌పై కీలక చర్చ!

చెన్నై కోవళంలో నేడు 31వ దక్షిణ రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ భేటీ ప్రారంభం కానుంది. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, భద్రత, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు సహా పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

ఈ సమావేశానికి తమిళనాడు సీఎం విజయ్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర రాష్ట్రాల నేతలు హాజరుకానున్నారు.

ముఖ్యంగా డీలిమిటేషన్ అంశంపై సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను యథాతథంగా కొనసాగించాలని తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకూడదని నేతలు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడులోని చెన్నై సమీపంలోని కోవలం వద్ద ఒక స్టార్ హోటల్‌లో నేడు 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అనేక కీలక అంశాలు, కేటాయింపులు, ఆస్తుల వాటాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనికి హాజరవుతారు.

సౌత్ స్టేట్స్ సీఎంల భేటీ..

దక్షిణాది రాష్ట్రాల పాలకులతో కేంద్రం ఈరోజు ఆయా రాష్ట్రాల్లోని అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసింది. మహాబలిపురంలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంపైన చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు దీనికి హాజరవుతారు. తెలుగు రాష్ట్రం రెండుగా విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై సీఎం ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తులు-అప్పుల పంపకం, రెవెన్యూ లోటు భర్తీ వంటి ఆర్థిక అంశాల్లో కేంద్రం వెంటనే చొరవ చూపి పరిష్కరించాలని కోరనుంది ఏపీ సర్కారు.

జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్‌తో అన్యాయం జరగకూడదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో నేటి సమావేశంలో డీలిమిటేషన్ అంశం ప్రధాన చర్చగా మారే అవకాశం ఉంది.