తొలి మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు..ఇషాన్ కిషన్..

టీమ్ఇండియాకు దూరమైన ఇషాన్ కిషన్ ఐపీఎల్‌ 2025లో తన తొలి మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. గత సీజన్‌ వరకు ముంబయి ఇండియన్స్లో కీలక ఆటగాడిగా ఉన్న ఇతడు ఆ జట్టు రిటైన్‌ చేసుకోకపోవడం వల్ల ఐపీఎల్ మెగా వేలంలోకి వచ్చాడు. వేలంలో ఇషాన్ కిషన్ను హైదరాబాద్ రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ భారీ ధరకు న్యాయం చేస్తూ తన తొలి మ్యాచ్లో శతకం బాది అభిమానుల మనసు దోచుకున్నాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్తో ఇషాన్ను మళ్లీ టీమ్ఇండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఏడాదిన్నరగా జట్టుకు దూరం..
టీమ్ఇండియా తరఫున చివరగా 2023 నవంబర్లో ఆడిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. కొన్నాళ్ల క్రితం వరకు వన్డేలు, టీ20ల్లో భారత జట్టులో కీలకంగా ఉన్నాడు. వికెట్‌ కీపర్‌గా, బ్యాటర్‌గా రాణించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతికొద్ది మంది బ్యాటర్లలో ఇషాన్‌ కూడా ఒకడు. జాతీయ జట్టుకు ఆడనప్పుడు దేశవాళీలో ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ మాటలను ఇషాన్ పట్టించుకోలేదు. బేఖాతరు చేశాడు. దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి బీసీసీఐ తప్పించింది. దీంతో 2024లో ఇషాన్ ఐపీఎల్‌లోనే ఆడాడు. తర్వాత వెనక్కి తగ్గిన కిషన్‌ దేశవాళీ క్రికెట్ ఆడాడు.