రిజర్వాయర్లలో ఇప్పటికే వంద టీఎంసీలకుపైగా నీటిని ఏపీ నిల్వ చేసుకున్నది. అయినా తాగునీటి పేరుతో శ్రీశైలం జలాలను మరో 40 టీఎంసీలకు వరకు తరలించుకుపోయింది…
శ్రీశైలం నీళ్లపై కొత్త టెన్షన్..
పోతిరెడ్డిపాడు గేటు డ్యామేజ్‌తో ఏపీకి అదనపు నీరు?.
గేటు డ్యామేజ్ సాకుగా చూపిస్తూ నీటిని తరలించకపోతున్నారంటూ ఆరోపణలు..
కృష్ణా జలాల పంపకాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) త్రీమెంబర్ కమిటీ ఇటీవల రెండుసార్లు సమావేశమైనప్పటికీ.. ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే సమావేశాలు ముగిశాయి. దీంతో సమావేశాలతో సమస్య పరిష్కారం కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కృష్ణా జలాలను మళ్లించేందుకు ఏపీ కొత్త ఎత్తుగడలకు పాల్పడుతోందన్న ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి..
పోతిరెడ్డిపాడు గేటు డ్యామేజ్‌తో పెరిగిన ఆందోళన.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద గేటు దెబ్బతినడం ఇప్పుడు తెలంగాణలో ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే నాలుగు గేట్ల ద్వారా రోజుకు సుమారు 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ మళ్లిస్తోందని తెలంగాణ వర్గాలు చెబుతున్నాయి. గేటు డ్యామేజ్ కారణంగా నీటి ప్రవాహాన్ని మరింతగా మళ్లించే అవకాశం ఏర్పడిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దెబ్బతిన్న గేటు/రోప్ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టేందుకు 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందని ఏపీ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 150 మీటర్ల రోప్ అవసరమవుతుందని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో మరమ్మతులు పూర్తయ్యేలోపు మరో 10 నుంచి 15 టీఎంసీల నీరు ఏపీ వైపు తరలిపోయే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరమ్మతులు త్వరగా పూర్తవుతాయా లేదా అన్న సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాగునీటి అవసరాలపై ప్రభావం ఉంటుందా?
ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ రిజర్వాయర్ల వైపు భారీగా నీరు తరలిపోయే అవకాశం ఉందని తెలంగాణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణలో తాగునీటి అవసరాలపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి..
నెల రోజుల్లో 60 టీఎంసీలు ఖాళీ.
మరోవైపు శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. గత నెల 12వ తేదీ నాటికి ప్రాజెక్టులో సుమారు 185 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. తాజాగా అది 123 టీఎంసీలకు పడిపోయిందని పేర్కొంటున్నారు. అంటే నెల రోజుల వ్యవధిలో దాదాపు 60 టీఎంసీల నీరు తగ్గిపోయింది.
ఇందులో ఏపీ వాటా దాదాపు 40 టీఎంసీలు ఉందని తెలంగాణ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు తరలించిన నీటిలోనూ ఏపీ తన వాటా పేరుతో నీటిని వినియోగించుకోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొంటున్నాయి.
మొత్తంగా శ్రీశైలం నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో పోతిరెడ్డిపాడు గేటు డ్యామేజ్ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. KRMB త్రీమెంబర్ కమిటీ సమావేశాలు ఎలాంటి నిర్ణయానికి రాకపోవడం, మరోవైపు నీటి మళ్లింపుపై ఆరోపణలు రావడంతో కృష్ణా జలాల వివాదం మళ్లీ వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.