మొదటి విడత నామినేషన్ల స్వీకరణ మొదలు..!

స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తెరలేపింది. షెడ్యూల్ ప్రకారం యథాతథంగా ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయించింది. మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణను ప్రారంభించింది. మొదటి విడత ఎన్నికల నోటీసులను రిటర్నింగ్ అధికారులు జారీ చేశారు. ఈ నెల 11 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత నెల 29న షెడ్యూలు, నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. ఈ నెల 23న మొదటి విడత, 27వ తేదీన రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ నేడు కూడా కొనసాగనుండగా, ఎస్ఈసీ మాత్రం ఎన్నికల ప్రక్రియను యధావిధిగా నిర్వహించాలని నిర్ణయించింది. గత నెల 29న నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం, షెడ్యూల్‌ ప్రకారమే ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ వార్డులు, సర్పంచిల ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం హైకోర్టులో విచారణ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు న్యాయవాదులతో చర్చించారు. హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున ముందుకెళ్లవచ్చని న్యాయవాదులు సూచించినట్లు తెలిపారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేటి నుంచి నామినేషన్లు, ఇతర ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు…

నేటి నుంచి నామినేషన్లు : ఇవాళ తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీల వారీగా ఓటరు జాబితాను ప్రదర్శిస్తారు. ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి, 15న ఉపసంహరణ గడువు ముగిశాక ఆ రోజున పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రెండో విడత నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల చేసి, ఆ రోజు నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 19న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి, 27న పోలింగ్ నిర్వహిస్తారు.

నవంబరు 11న ఓట్ల లెక్కింపు : గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక నవంబరు 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండు విడతల ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ, రెండో విడతలో 273 జడ్పీటీసీ, 2,786 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ల ఎన్నికకు తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. హైదరాబాద్, మేడ్చల్‌లో గ్రామ పంచాయతీలు లేనందున, మిగతా 31 జిల్లాల్లోని 565 జడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీలు, 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. హైకోర్టు స్టే కారణంగా 14 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు…