చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్‌ హ్యాండ్స్‌ ఇవ్వలేదు: గిల్‌.

టీమిండియా అద్బుతం చేసింది. ఓటమి తప్పదనుకున్న చోట భారత ఆటగాళ్లు తమ విరోచిత పోరాటంతో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును డ్రాగా ముగించారు..దాదాపు రెండు రోజుల పాటు ఇంగ్లండ్‌ బౌలర్లకు ఎదురీది మరి మ్యాచ్‌ను తమ చేజారకుండా కాపాడుకున్నారు.

సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌(103), కేల్‌ రాహుల్‌(90) తమ అద్బుత బ్యాటింగ్‌లతో ఆదుకోగా.. ఆ తర్వాత రవీంద్ర జడేజా(185 బంతుల్లో 107 నాటౌట్‌), వాషింగ్టన్‌ సుందర్‌(206 బంతుల్లో 101 నాటౌట్‌) ఆజేయ శతకాలతో భారత్‌ను ఓటమి నుంచి గట్టెక్కించారు.

వీరిద్దరి అసమాన పోరాటానికి ఇంగ్లీష్‌ జట్టు ప్లేయర్లు తమ సహనాన్ని కోల్పోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ రెండు, ఆర్చర్‌, బెన్‌ స్టోక్స్‌ తలా వికెట్‌ సాధించారు. ఈ మ్యాచ్‌ డ్రా గా ముగియడంతో సిరీస్‌ను సమం చేసే అవకాశం టీమిండియాకు లభించింది. ఇక మాంచెస్టర్‌ టెస్టు డ్రా ముగియడంపై భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ స్పందించాడు.

తమ ఆటగాళ్ల అసాధారణ పోరాటంపై గిల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. “కీలకమైన మ్యాచ్‌లో మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గత రెండు రోజులుగా మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎందుకంటే వికెట్లు పడితే మ్యాచ్‌ స్వరూపమే మారిపోతుంది.

నాలుగో రోజును కేఎల్‌ భాయ్‌, నేను జాగ్రత్తగా ఆడి ముగించాము. ఐదో రోజు పిచ్‌ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో? అనే ఆందోళన నెలకొంది. అందుకే ప్రతీ బంతిని కూడా జాగ్రత్తగా ఆడాలని నిర్ణయించుకున్నాము.

అందుకే షేక్‌ హ్యాండ్స్‌ ఇవ్వలేదు..
మేం ప్రతీ బంతిని ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను వీలైనంత ఆఖరివరకు తీసుకెళ్లాలనుకున్నాం. జడేజా, సుందర్‌ ఆసాధరణ ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ తమ సెంచరీలకు చేరువలో ఉన్నారు. వారు సెంచరీలు చేసేందుకు ఆర్హులు, అందుకే డ్రాను అంగీకరించేందుకు కరచాలనం చేయలేదు.

ఈ సిరీస్‌లో ప్రతీ మ్యాచ్‌ ఆఖరి రోజు, చివరి సెషన్‌ వరకు సాగింది. ఈ సిరీస్‌ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాము. ప్రతీ టెస్టు మ్యాచ్‌ కూడా ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోంది. మా ఆఖరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు ప్రయత్నిస్తాము.

ప్రతీసారి కాస్త ఒత్తిడి..
నిజాయితీగా చెప్పాలంటే గతంలో ఎన్ని పరుగులు చేశారనేది ముఖ్యం కాదు. వైట్‌ జెర్సీ ధరించి దేశం కోసం ఆడిన ప్రతీసారి కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. అప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. అప్పుడే ఆటను మనం ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియజేస్తుంది.

నేను బ్యాటింగ్‌ చేసే ప్రతీ సారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటా. నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటునాను. తొలి ఇన్నింగ్స్‌లో మేము మంచి స్కోర్‌ సాధించాము. కానీ మా బ్యాటర్లలో చాలా మంది తమకు లభించిన ఆరంభాలను పెద్ద స్కోర్లగా మలచడంలో విఫలమయ్యారు.

ఇలాంటి వికెట్‌పై ఒకరిద్దరు బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడడం చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తూ మేము అలా చేయలేకపోయాము. ఇక బుమ్రా ఫిట్‌నెస్ గురించి ఇప్పుడే ఏమి చెప్పలేను. అదేవిధంగా మేం మ్యాచ్ గెలుస్తున్నంత కాలం టాస్ గురించి కూడా పట్టించుకోమని” పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెజేంటేషన్‌లో గిల్‌ పేర్కొన్నాడు.

సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్( సాయి సుదర్శన్ 61, బెన్ స్టోక్స్ 5/72)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్(జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141, జడేజా 4/143)

భారత్ రెండో ఇన్నింగ్స్: 425/4 (శుభ్‌మన్ గిల్ 103, జడేజా 107 నాటౌట్‌, సుందర్ 101 నాటౌట్‌, క్రిస్ వోక్స్ 2/67)..

జడేజాపై మాటల దాడి..

మాండేటరీ ఓవర్లు ప్రారంభానికి ముందు జడేజా వద్దకు స్టోక్స్ వెళ్లి షేక్‌హ్యాండ్ ఇచ్చి మ్యాచ్ ను డ్రాగా ముగిద్దామని అనుకున్నాడు. ఈ ప్రతిపాదనకు జడేజా ఒప్పుకోకపోవటంతో జడేజాపై స్టోక్స్, ఇతర ఇంగ్లాండ్ ఆటగాళ్లు వెటకారంతో మాటల దాడి చేశారు.
స్టోక్స్ జడేజా వద్దకు వెళ్లి.. మీకు 100 కావాలంటే, మీరు ఇంతకు ముందే ఇలాగే బ్యాటింగ్ చేసి ఉండాల్సింది అంటూ వాదనకు దిగాడు. జిడ్డూ.. బ్రూక్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్ లో టెస్టు సెంచరీ చేయాలనుకుంటున్నావా..? అంటూ వెంటకారంగా అన్నాడు.
జడేజా స్పందిస్తూ.. నేను సెంచరీ చేయాలని ఏం కురుకుంటావు.. వెళ్లిపో అంటూ సూచించాడు.
అక్కడే ఉన్న క్రాలీ స్పందిస్తూ.. జడ్డూ నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వు చాలు.. సూచించగా.. నేను ఏమీ చేయలేను.. నా చేతుల్లో ఏం లేదు అంటూ జడేజా బదులిచ్చాడు. అయినా జడేజా మాటలను క్రాలీ పట్టించుకోలేదు.. నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వు చాలు అంటూ ఒత్తిడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇంగ్లాండ్ ప్లేయర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్) సెంచరీలు చేసిన తరువాత మ్యాచ్ డ్రాగా ముగించారు…

గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్..

చివరిలో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్, ఇతర ప్లేయర్లు ప్రవర్తనను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా తప్పుబట్టారు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ.. ‘ఒకరు 90 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంటే, మరొకరు 85 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంటే, వారు సెంచరీకి అర్హులు కాదా?’ అని గంభీర్ ప్రశ్నించారు. ఇదే పరిస్థితిలో ఇంగ్లాండ్ ఉంటే.. వాళ్ళు వెళ్ళిపోయేవారా? ఇంగ్లాండ్ నుండి ఎవరైనా 90 లేదా 85 పరుగులతో బ్యాటింగ్ చేసి ఉంటే, వారి మొదటి టెస్ట్ సెంచరీ సాధించే అవకాశం ఉంటే, మీరు వారిని అలా చేయడానికి అనుమతిస్తారా?.. చూడండి, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఆ విధంగా ఆడాలనుకుంటే, అది వాళ్ళ ఇష్టం. ఆ ఇద్దరు కుర్రాళ్ళు వందకు అర్హులని నేను అనుకుంటున్నాను, వాళ్ళు దాన్ని సాధించారని గంభీర్ అన్నాడు.