వాయు కాలుష్యం సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

దేశ రాజధాని దిల్లీ- ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాయు కాలుష్యం సమస్య దిల్లీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అంశమని ధర్మాసనం పేర్కొంది. దిల్లీలో కాలుష్య దుస్థితి నేపథ్యంలో ఈ అంశంపై తక్షణమే విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ చేసిన విజ్ఞప్తిని సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడానికి తమ వద్ద ‘మంత్రదండం’ లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. దిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి గల మూలాలను మొదటగా గుర్తించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆ తర్వాతే పరిష్కారాలను కనుగొనగలమని అభిప్రాయపడ్డారు.

” కాలుష్యం అంశాన్ని విచారణకు స్వీకరిస్తాం. అయితే, దీనికి త్వరగా పరిష్కారాలు కనుగొనడానికి మా వద్ద మంత్రదండం లేదు. సమస్యలను గుర్తించి వాటికి అవసరమైన పరిష్కాలను కనుక్కోవాలి. ఈ సమస్యకు గల అన్ని కారణాలను గుర్తించాలి. కాలుష్యం సమస్యకు ఒక కారణం ఉండదు. బహుశా ప్రజలు ఒకే కారణం ఉండవచ్చని భావించవచ్చు. కానీ, కాలుష్యానికి అనేక కారణాలు దోహదం చేస్తాయి. ప్రతి కారణానికి పరిష్కారాలను శాస్త్రవేత్తలు మాత్రమే కనుక్కోగలరు. ప్రభుత్వం ఏదైనా పరిష్కారంతో ముందుకు వచ్చి ఉంటుందని మేము ఆశిస్తున్నాం. కాలుష్యంపై మేము సైతం నిరంతరం పర్యవేక్షణ చేపడుతాం. సోమవారం ఈ అంశంపై విచారణ చేపడుతాం”

– భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

పంట వ్యర్థాలను తగలబెట్టడం అరికట్టాలి!
అంతకుముందు జస్టిస్ బీఆర్ గవాయ్ సీజేఐగా ఉన్నప్పుడు ఆయనతో కూడిన ధర్మానసం వాయు కాలుష్య సమస్యపై విచారణ చేపట్టింది. రాజధాని పరిసర ప్రాంతాలను ఉద్దేశించి ప్రస్తావించింది. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ ప్రభుత్వాలు కాలుష్యాన్ని తగ్గించడానికి నివారణ చర్యలు చేపట్టాలని, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ విషయాలను కోర్టులు కూడా తప్పకుండా పర్యవేక్షించాలని పేర్కొంది. కాలుష్యాన్ని అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో గాలి నాణ్యతను మరింత దిగజార్చే కారకాల్లో ఒకటైన పంట వ్యర్థాలు తగలబెట్టడం అరికట్టాలని తెలిపింది. అయితే ఈ విషయంపై పంజాబ్, హరియాణాల నుంచి నివేదికలను కూడా అప్పట్లో న్యాయస్థానం కోరింది..