పులి దాడిలో నలుగురు మహిళలు మృతి.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడి కలకలం రేపింది. సిందేవాహి తాలూకాలోని అటవీ ప్రాంతంలో తునికాకు(బీడి ఆకు) సేకరణకు వెళ్లిన 13 మంది మహిళలపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు చనిపోయారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ ఏరియాలో పులి సంచారం ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఉదయం 8గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
పులులు ఎందుకు దాడి చేస్తాయి?
పులులు సాధారణంగా ‘షై యానిమల్స్’ అడవుల్లోనూ ఒంటరిగా తిరగడానికే ఇష్టపడతాయి. తమ ఆవాసాల్లోకి మనుషులు వచ్చినా దూరంగా వెళ్లడానికే ప్రయత్నిస్తాయి. మనుగడకు ముప్పు వాటిల్లుతుందని భావిస్తేనే దాడి చేస్తాయి. ఒకసారి మనిషిపై దాడి చేసి రక్తం రుచి మరిగిన పులి ప్రవర్తనలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వన్య ప్రాణి నిపుణులు చెబుతున్నారు. అలాంటివి మనుషులను సులభ వేటగా భావించి గ్రామాల సమీపానికి వస్తాయని అంటున్నారు.