బెయిల్పై విడుదలైన సెంథిల్ బాలాజీ (Senthil Balaji).. కొన్ని గంటల్లోనే తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యత చేపట్టడంపై సుప్రీం కోర్టు (Supreme Court) ఆశ్చర్యం వ్యక్తం చేసింది..అసలు అక్కడ ఏం జరుగుతోందని ప్రశ్నించింది. బాలాజీకి బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
డీఎంకే నేత సెంథిల్ బాలాజీ బెయిల్పై విడుదలైన మరుసటి రోజే కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ నిర్ణయం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీం విచారణ చేపట్టింది. ”బెయిల్పై విడుదలైన కొన్ని గంటల్లోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సెంథిల్ కేబినెట్లో మంత్రి కాబట్టి.. సాక్షులు కచ్చితంగా ప్రభావితం అవుతారనే సందేహాలు వస్తాయి. అసలు అక్కడ ఏం జరుగుతోంది..?” న్యాయస్థానం ప్రశ్నించింది.
”బెయిల్ మంజూరు విషయంలో మేము సరైన నిర్ణయమే తీసుకున్నాం. అతడి బెయిల్ను రద్దు చేయడం గురించి విచారణ జరిపేది లేదు. కానీ, సాక్షులు ప్రభావితం అవుతారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. దీనిపై విచారణ జరుపుతాం” అని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 13కు వాయిదా వేసింది.
“పార్లమెంట్లో ‘సబర్మతి రిపోర్ట్’ను వీక్షించనున్న ప్రధాని మోదీ”
మనీలాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో బెయిల్ మంజూరు అయింది. ఆయన బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్ అయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో బాలాజీ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు..