SCOలోకి మేము వస్తాం. టర్కీ .. భారత్ అభ్యంతరం…!

SCOలోకి మేము వస్తాం. టర్కీ …! భారత్‌ ప్రశ్నల వర్షం.?

చైనా, రష్యా నేతృత్వంలోని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ (SCO)లో పూర్తిస్థాయి సభ్యత్వం పొందేందుకు టర్కీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు అంకారా ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే పాకిస్థాన్‌తో టర్కీకి ఉన్న దీర్ఘకాలిక వ్యూహాత్మక, రక్షణ సంబంధాలు.. కశ్మీర్ అంశంపై అంకారా గతంలో తీసుకున్న వైఖరి.. న్యూఢిల్లీకి ఇప్పటికీ ఆందోళన కలిగించే అంశాలుగానే ఉన్నాయి.
SCOలో చేరేందుకు ఎర్డొగన్ ఆసక్తి
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగన్.. SCOలో పూర్తిస్థాయి సభ్యత్వంపై అంకారా ఆలోచించవచ్చనే సంకేతాలు ఇచ్చారు. అయితే SCOలో చేరడం వల్ల తమ ప్రస్తుత అంతర్జాతీయ కూటములను, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలతో ఉన్న సంబంధాలను వదులుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో భారత్‌కు మాత్రం అసలు ప్రశ్న మరోటి. టర్కీ SCOలో చేరితే.. భారత్‌తో దాని సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకునే ప్రయత్నం..

ఒకవైపు న్యూఢిల్లీతో దౌత్య సంబంధాలను చక్కదిద్దుకునేందుకు టర్కీ ప్రయత్నిస్తోంది. మరోవైపు పాకిస్థాన్‌తో తన దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది.
పాకిస్థాన్‌తో తమ సంబంధాలు భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు అడ్డంకిగా మారకూడదని టర్కీ.. న్యూఢిల్లీకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పాకిస్థాన్‌కు అదనపు సైనిక సహాయం అందించామన్న వార్తలను కూడా అంకారా ఖండించింది. ఇస్లామాబాద్‌తో తమ రక్షణ సంబంధాలు చాలా కాలంగా కొనసాగుతున్న సాధారణ సంబంధాలేనని టర్కీ చెబుతోంది..

ఆపరేషన్ సిందూర్ తర్వాత పెరిగిన దూరం
అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-టర్కీ సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన సైనిక చర్యపై టర్కీ విమర్శలు చేయడం న్యూఢిల్లీకి అసంతృప్తి కలిగించింది.
టర్కీ వైఖరి పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉందన్న అభిప్రాయాలు భారత్‌లో వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా ఆ ఘర్షణ సమయంలో పాకిస్థాన్ టర్కీ తయారీ డ్రోన్లను ఉపయోగించిందన్న వార్తలు కూడా ఇరు దేశాల మధ్య అనుమానాలను మరింత పెంచాయి.

కశ్మీర్ అంశం.. మరో ప్రధాన అడ్డంకి

పాకిస్థాన్‌తో టర్కీ బంధమే భారత్-టర్కీ సంబంధాల్లో సమస్యకు కారణం కాదు. కశ్మీర్ అంశంపై అంకారా వైఖరి కూడా చాలా కాలంగా ఇరు దేశాల మధ్య అసంతృప్తికి కారణమవుతోంది. ఎర్డొగన్ 2002లో అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్-టర్కీ సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. ఉన్నతస్థాయి రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2002లో సుమారు 700 మిలియన్ డాలర్ల నుంచి 2022 నాటికి దాదాపు 13.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే జమ్మూకశ్మీర్‌పై భారత్ వైఖరిని టర్కీ పదేపదే విమర్శించడం పరిస్థితిని మార్చింది.

2019లో ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని టర్కీ ప్రత్యేకంగా వ్యతిరేకించింది. 2025లో ఎర్డొగన్ పాకిస్థాన్ పర్యటన సందర్భంగా కూడా కశ్మీర్ అంశంపై ఇస్లామాబాద్ వైఖరికి మద్దతు తెలిపారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై టర్కీ ప్రస్తావించడాన్ని భారత్ వ్యూహాత్మక అపనమ్మకానికి ప్రధాన కారణంగా చూస్తోంది.

భారత్‌కు అసలు సవాల్ ఇదే!.

ఇప్పుడు టర్కీ SCOలో పూర్తిస్థాయి సభ్యత్వం కోసం ముందుకు వస్తే.. ఆ సంస్థలో ఇప్పటికే భారత్ కూడా కీలక సభ్యదేశంగా ఉంది. మరోవైపు పాకిస్థాన్ కూడా SCOలో సభ్యదేశమే.
అందుకే టర్కీ SCOలో చేరడం వల్ల భారత్-టర్కీ-పాకిస్థాన్ సమీకరణాలు ఎలా మారతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.
టర్కీ పాశ్చాత్య కూటములతో సంబంధాలను కొనసాగిస్తూనే SCOలో తన పాత్రను పెంచుకోవాలని చూస్తుండటంతో..
అంకారా భవిష్యత్ విదేశాంగ విధానం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
భారత్‌తో స్నేహం.. పాకిస్థాన్‌తో వ్యూహాత్మక బంధం.. SCOలో చేరాలన్న ఆసక్తి..!
టర్కీ ఎటువైపు అడుగులు వేస్తుందన్నదే ఇప్పుడు కీలకం.