భారతీయ ఉద్యోగులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఈ ఏడాదిన కొత్తగా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు పౌరసత్వం దక్కాలంటే దాదాపు 179 ఏళ్ల సమయం పడుతుందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపి) వెల్లడించింది.
అమెరికా వర్కింగ్ వీసాలపై పనిచేస్తున్న మన దేశ నిపుణులకు గ్రీన్ కార్డ్ లభించడం గగనంగా మారింది. అమెరికా పౌరసత్వ విభాగం లెక్కల ప్రకారం ఈ ఏడాదిన ఈబి-2 క్యాటగిరీ కింద దరఖాస్తు చేసే భారతీయులు క్యూ లైన్లో 179 ఏళ్లు నిరీక్షించక తప్పదు. ప్రతీ దేశానికి ఏటా ఇచ్చే గ్రీన్ కార్డ్ కోటాలో 7 శాతం పరిమితి విధించడమే ఈ దారుణ పరిస్థితికి ముఖ్య కారణం. మన దేశం నుంచి అత్యంత ప్రతిభావంతులైన ఐటీ నిపుణులు, ఇంజనీర్లు లక్షల సంఖ్యలో వెళ్తున్నప్పటికీ కోటా పరిమితి వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోంది.
క్యూలో దాదాపు 10 లక్షల మంది భారతీయులు..
అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుని బ్యాక్లాగ్లో చిక్కుకుపోయిన వారి సంఖ్య డిసెంబర్ నాటికి ఏకంగా 12.6 లక్షలకు చేరింది. ఇందులో దాదాపు 10 లక్షల మంది కేవలం భారతీయులే కావడం గమనార్హం. అంటే మొత్తం బ్యాక్లాగ్లో 79 శాతం వాటా మన దేశస్థులదే కావడం గమనార్హం. ఐదేళ్ల క్రితం 10.5 లక్షలుగా ఉన్న ఈ పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఏకంగా 20 శాతానికి పైగా పెరిగింది. ప్రతీ సంవత్సరం జారీ చేసే గ్రీన్ కార్డుల సంఖ్య పరిమితంగా ఉండటంతో ఈ వెయిటింగ్ లిస్ట్ నిరంతరం పెరుగుతోంది.